వచ్చే ఏడాది పది కొత్త ‘వందే భారత్’ రైళ్లు పట్టాలెక్కేలా భారతీయ రైల్వే ప్రయత్నాలు చేస్తూ ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2022 ఆగస్టు నాటికి 40 నగరాలను కలుపుతూ కనీసం 10 కొత్త స్వదేశీ సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తీసుకుని రావాలని భారత రైల్వే యోచిస్తోంది. 44 వందే భారత్ రైళ్లకు విద్యుత్ వ్యవస్థలను సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన మేధా సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో పొందింది. వచ్చే ఏడాది మార్చి నాటికి కనీసం రెండు ప్రోటోటైప్ రైళ్లకు ట్రయల్ రన్ ను నిర్వహించాలని భావిస్తూ ఉన్నారు. వందే భారత్ రైళ్లకు అవసరమైన అన్ని పరీక్షలు చేయాల్సి ఉంది.ట్రయల్స్ తో పాటు, ప్రోటోటైప్ రైలు ప్రయాణీకులతో 1 లక్ష కిలోమీటర్ల వాణిజ్య కార్యకలాపాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది.
దేశీయ సెమీ హై స్పీడ్ ట్రైన్ ‘వందే భారత్’ ప్రాజెక్టుపైనే కొత్త రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానంగా దృష్టిసారించినట్లు సమాచారం. రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఈ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏడాది ఆగస్ట్ నాటికి దేశంలోని 40 నగరాలకు వందే భారత్ రైళ్లు నడిచేలా ప్రణాళికను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాటి ఉత్పత్తి వేగాన్ని పెంచాలని మేధా సంస్థకు రైల్వే మంత్రి సూచించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రెండు నమూనా రైళ్లను ప్రయోగాత్మకంగా నడిపేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంజిన్ లేకుండా నడిచే ఈ రైళ్లలో విమానాల్లో మాదిరిగా సీట్లు, ఆటోమేటిక్ డోర్లు, ఆధునాతన సౌకర్యాలు ఉంటాయి. ప్రస్తుతం దేశంలో రెండు ‘వందే భారత్’ రైళ్లు నడుస్తున్నాయి. ఢిల్లీ-వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ 2019లో ప్రారంభించారు. మరో రైలు ఢిల్లీ-కత్రా మధ్య నడుస్తోంది. ఇలాంటివి 100 రైలు సెట్లను తీసుకుని రావాలని భారతప్రభుత్వం ప్రణాళిక రచించింది. 16 కోచ్‌లతో ఒక్కో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఉంటుంది. 100 వందే భారత్ రైళ్లను ఉత్పత్తి చేయడానికి, సుమారు 11,000 కోట్ల రూపాయలు (ప్రతి రైలుకు సుమారు 110 కోట్లు) ఖర్చు అవుతుంది. కొత్త ప్రణాళిక ప్రకారం, రాయ్ బరేలిలోని ఇండియన్ రైల్వే- మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తాలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ యొక్క మూడు ఉత్పత్తి యూనిట్లను ఉపయోగించడం ద్వారా 2024 నాటికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అదే పూర్తీ అయితే భారత రైల్వేకు సరికొత్త రూపు సంతరించుకుంటుంది.