More

    ఆఫ్ఘనిస్థాన్ లో భారత ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మృతి

    భారత్‌కు చెందిన సీనియర్‌ ఫొటో జర్నలిస్ట్‌ డానిష్‌ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు, ప్రభుత్వ దళాలకు మధ్య జరుగుతున్న పోరును చిత్రీకరిస్తుండగా మరణించినట్లు భారత్‌లోని ఆఫ్ఘనిస్థాన్ రాయబారి ఫరీద్‌ మాముంద్‌జయీ తెలిపారు. ‘కాందహార్‌లో గురువారం రాత్రి నా స్నేహితుడు డానిష్‌ సిద్దిఖీ చనిపోయాడనే విషాద వార్తతో నేను షాక్‌ అయ్యాను. పులిట్జర్‌ అవార్డ్‌ గ్రహీత, భారత జర్నలిస్ట్‌ అఫ్గాన్‌ భద్రతా దళాలతోపాటూ ఉన్నారు. నేను ఆయన్ను రెండు వారాల క్రితం కలిశాను. ఆయనప్పుడు కాబూల్‌ వెళ్తున్నారు. ఆయన కుటుంబం, రాయిటర్స్‌కు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను” అని ఫరీద్ ట్వీట్‌ చేశారు. తమ ఫొటో జర్నలిస్ట్‌ డానిష్‌ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్లో చనిపోవడం తీవ్ర వేదనకు గురిచేసిందని రాయిటర్స్‌ ప్రెసిడెంట్‌ మైఖేల్‌ ఫ్రీడెన్‌బరో, ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అలెస్సాండ్రా గలోనీ కూడా ఒక ప్రకటనలో తెలిపారు. డానిష్‌ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కాందహార్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం ఆఫ్ఘనిస్థాన్ ప్రత్యేక బలగాలపై దాడి జరిగినప్పుడు డానిష్‌ అక్కడే ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్ అధికారుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు.

    పులిట్జర్ బహుమతి గ్రహీత రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఆకస్మికమరణంపై పలువురు జర్నలిస్టులు, మీడియా మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానంటూ ట్వీట్‌ చేసిన మూడురోజుల్లోనే అతడిని మృత్యువు కబళించింది.

    తాలిబన్లు బుధవారం కాందహార్‌లోని స్పిన్‌ బోల్డక్‌ నగరం, అక్కడ పాకిస్తాన్‌ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఒక కీలక పోస్టును తమ అధీనంలోకి తీసుకున్నారు. డానిష్‌ సిద్దిఖీ కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్థాన్ లో కొనసాగుతున్న ఘర్షణలు, ఉద్రిక్తతలను కవర్‌ చేస్తున్నారు. తన ట్విటర్‌ అకౌంట్‌లో ద్వారా అక్కడి పరిస్థితులను డానిష్ వివరించేవారు. అక్కడ దాడుల నుంచి తను తృటిలో ఎలా తప్పించుకున్నారో చెప్పేవారు. డానిష్ సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించి, తరువాత ఫోటో జర్నలిస్టుగా మారారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ఫోటో జర్నలిస్ట్‌గా ఉన్నారు. ఇండియాటుడే గ్రూప్‌లో కొంతకాలం కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో యుద్ధాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం, నేపాల్ భూకంపాలు, హాంకాంగ్ నిరసనలు మొదలైనవాటిని కవర్ చేశారు.

    సిద్దిఖీ తండ్రి ప్రొఫెసర్ అక్తర్ సిద్దిఖీ ఐఎఎన్‌ఎస్‌తో ఇలా అన్నారు “నా కొడుకు గురించి నాకు ఒక గంట క్రితం సమాచారం వచ్చింది. చివరిసారిగా నా కొడుకుతో మాట్లాడినది రెండు రోజుల క్రితం, ఆ సమయంలో అతను చాలా సంతోషంగా ఉన్నాడు.” రోహింగ్యా సమస్యను కవరేజ్ చేసినందుకు సిద్దిఖీకి 2018 లో పులిట్జర్ బహుమతి లభించింది. అతను జామియా విశ్వవిద్యాలయ విద్యార్థి. అతని తండ్రి అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్.

    Related Stories