టీ20 ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్ లో భారత్ మీద పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ విజయంపై పాకిస్తాన్ కు చెందిన నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వెళుతున్నారు. పాకిస్తానీ ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్ మొహమ్మద్ కు నోరు పారేసుకోవడం అలవాటే.. గతంలో కూడా ఆయన ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు అటు హిందువుల మీద.. ఇటు భారత్ మీద చేశారు. ఇక పాకిస్తాన్ మ్యాచ్ గెలవగానే తన నోటికి మరోసారి పని చెప్పారు. భారత్ మీద పాకిస్తాన్ గెలవడం ఇస్లాం గెలుపుగా అభివర్ణించారు. ‘ముస్లిం ప్రపంచం విజయం’ ఇది అంటూ షేక్ రషీద్ మొహమ్మద్ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అక్కడితో ఆగని షేక్ రషీద్.. భారత్ లోని ముస్లింలు కూడా పాక్ విజయాన్ని కాంక్షించారంటూ వ్యాఖ్యలు చేశారు.
“ఈ అద్భుతమైన విజయానికి పాకిస్తాన్ మొత్తాన్ని నేను అభినందించాలనుకుంటున్నాను. పట్టుదల, దృఢ సంకల్పం, ధైర్యం తో కూడిన ఒక ఆదర్శప్రాయమైన ప్రదర్శనతో తన ప్రత్యర్థిని ఓడించినందుకు పాకిస్తాన్ జట్టుకు నేను వందనం చేస్తున్నాను. ముస్లిం ప్రపంచం ముందు పాకిస్తాన్ తన ధర్మాన్ని ప్రదర్శించింది. మినిస్ట్రీరియల్ పని కారణంగా నేను హాజరుకాలేకపోయిన ఏకైక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది “అని అన్నారు. “ప్రజలు సంబరాలు జరుపుకునేందుకు వీలుగా ఇస్లామాబాద్‌లోని రావల్పిండిలో బారికేడ్లను తొలగించాలని నేను ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌ని ఆదేశించాను. ఈ ముఖ్యమైన మ్యాచ్ లో గెలిచిన పాక్ జట్టుకు, ప్రజలకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. టీ20 ప్రపంచకప్‌లో ఇది మా ‘ఫైనల్’ మ్యాచ్ తో సమానం” అని వీడియోలో చెప్పుకొచ్చారు. “పాకిస్తానీ బృందానికి భారతదేశంలోని ముస్లింలతో సహా ప్రపంచంలోని ముస్లింలందరి భావోద్వేగ మద్దతు ఉంది. ఇది ముస్లిం ప్రపంచ విజయం. పాకిస్తాన్ జిందాబాద్. ఇస్లాం జిందాబాద్” అంటూ వ్యాఖ్యలు చేశారు.
భారత్ లోని హిందువులను చంపడానికి స్మార్ట్ బాంబులు:
భారత్ లోని ముస్లింలను చంపకుండా కేవలం హిందువులను మాత్రమే చంపగలిగే స్మార్ట్ బాంబులను ఉపయోగిస్తామని గతంలో షేక్ రషీద్ మొహమ్మద్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! ఆగష్టు 2020 లో ఒక టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్ రషీద్ మాట్లాడుతూ సాంప్రదాయక యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం కంటే భారత సైన్యం చాలా ఉన్నతమైనదని చెప్పుకొచ్చాడు. అందువల్ల, పాకిస్తాన్ ‘మినియేటరైజ్డ్ అణ్వాయుధాల’ పై కసరత్తు చేస్తోంది. భారతదేశంలోని హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారని మరియు భారతీయ ముస్లింలకు ఎటువంటి హాని చేయరని ఆయన అన్నారు.