International

ఆఫ్ఘనిస్తాన్ లో భారతీయుడు కిడ్నాప్

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారతదేశానికి చెందిన వ్యక్తిని అపహరించారు. కాబూల్‌లో బాన్‌శ్రీ లాల్‌ అరిందేను తుపాకీతో బెదిరించి కొందరు కిడ్నాప్‌ చేశారని వార్తలు వెలువడ్డాయి. అపహరణ విషయంపై భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. లాల్‌ కుటుంబం హరియాణాలోని ఫరీదాబాద్‌ పట్టణంలో నివాసముంటోంది. కాబూల్‌లో లాల్‌ గత రెండు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూ ఖోస్ట్ కమ్యూనిటీకి చెందిన బాన్‌శ్రీ లాల్‌ సెప్టెంబర్ 14, మంగళవారం ఉదయం కాబూల్ లో పాయింట్ బ్లాంక్ లో తుపాకీతో అపహరించబడ్డారని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ ప్రెసిడెంట్ పునీత్ సింగ్ చాంధోక్ చెప్పారు. బాన్‌శ్రీ లాల్‌ గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఔషధ ఉత్పత్తుల వ్యాపారం చేస్తుండేవాడని తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పుడు అతను సిబ్బందితో కలిసి కాబూల్‌లోని తన దుకాణం వైపు వెళ్తున్నాడు. మంగళవారం ఉదయం నుండి బాన్‌శ్రీ లాల్‌ కనిపించకుండా పోయినట్లు కాబూల్ వర్గాలు ధృవీకరించాయి. కాబూల్ లోని పోలీస్ డిస్ట్రిక్ట్ (పిడి) 11 పరిధిలో ఈ సంఘటన జరిగిందని, కాబూల్ స్థానిక పోలీసులు బాన్‌శ్రీ లాల్‌ను అపహరించినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అత్యున్నత స్థాయిలో బాన్‌శ్రీ లాల్‌ కుటుంబానికి సహాయం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా మరియు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ జోక్యాన్ని పునీత్ సింగ్ చాంధోక్ కోరారు. చాంధోక్ బుధవారం నాడు “నిన్న ఉదయం #కాబూల్‌లో 50 ఏళ్ల #అఫ్ఘన్ #హిందూ భారతీయ పౌరుడిని తుపాకీతో అపహరించడం గురించి తెలుసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అతడిని రక్షించండి. ” అంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (DSGMC) నాయకులు మంజీందర్ సింగ్ (MS) సిర్సా కూడా భారత ప్రభుత్వ జోక్యాన్ని కోరారు. ‘కాబూల్‌లోని స్థానిక అధికారులతో మంతనాలు జరుపుతున్నాం. భారతీయ పౌరుడి కిడ్నాప్‌ వ్యవహారంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిరంతరం వారితో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ఢిల్లీలో గురువారం మీడియాతో చెప్పారు.

మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ ‘బాన్‌శ్రీ లాల్‌ ను కొందరు సాయుధ వ్యక్తులు తుపాకీతో అపహరించారు. అతడిని కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేశాము. అతను కాబూల్‌లో బాగా స్థిరపడిన వ్యాపారవేత్త. నేను కాబూల్‌లోని ప్రజలతో మాట్లాడాను. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తక్షణమే జోక్యం చేసుకోవాలని మరియు బాన్‌శ్రీ లాల్‌ ను త్వరగా రక్షించాలని నేను కోరుతున్నానని చెప్పుకొచ్చారు. ఈ ఘటన కారణంగా కాబూల్‌లోని మైనారిటీలు తమ జీవితం మరియు భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇస్లామిక్ ఎమిరేట్ యొక్క ఇంటెలిజెన్స్ విభాగం యొక్క 021 యూనిట్ ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు అతని అపహరణకు కారణం ఏమిటో తెలియలేదు. స్థానికులు మాత్రం కిడ్నాపర్లు అతడిని తాలిబాన్ అధికారులు ప్రధానంగా ఉపయోగించే వాహనంలో తీసుకెళ్లారని చెబుతున్నారు. అధికారులు కేసును విచారిస్తూ.. పలు ప్రాంతాల్లో సోదాలను నిర్వహించారు. బాన్‌శ్రీ లాల్‌ ఆచూకీ తెలుసుకోవడానికి మరియు అతని కిడ్నాప్ గురించి మరింత సమాచారం సేకరించడానికి అక్కడి ప్రజలతో భారత ప్రభుత్వం టచ్ లో ఉంది. అక్కడి అధికారులపై భారత్ కూడా ఒత్తిడి తీసుకుని వస్తోంది. బాన్‌శ్రీ లాల్‌ కుటుంబం భారతదేశంలో నివసిస్తోంది. బాన్‌శ్రీ లాల్‌ సోదరుడు అశోక్ కుమార్ కూడా కాబూల్‌లో ఉన్నారు. బాన్‌శ్రీ లాల్‌ తాలిబాన్లు అక్కడ ప్రభుత్వాన్ని చేపట్టడానికి ముందు నుండి కాబూల్‌లోనే ఉన్నాడు. ఇటీవల అతను భారతదేశానికి రావాలనుకున్నాడు కానీ తరలింపు విమానాల విషయంలో ఆంక్షల కారణంగా భారత్ కు చేరుకోలేకపోయాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 + ten =

Back to top button