More

    దేశంలో CAA అమలుకు శ్రీకారం

    దేశంలో చారిత్రక ఘట్టానికి తొలి అడుగు పడింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అమలు శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన మైనార్టీలకు.. అంటే, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు.. భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తొలి దశలో గుజరాత్‌, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, పంజాబ్‌లోని.. 13 జిల్లాల్లో నివసించే వారికి ఈ సదుపాయం కల్పిస్తామని చెప్పింది. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం… తన ఆదేశాన్ని వెంటనే అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇదే చట్టానికి సంబంధించి 2009లో కొన్ని రూల్స్ వచ్చాయి. వాటి ఆధారంగా.. కేంద్రం 2019లో పౌరసత్వ చట్టానికి సవరణలు చేసింది. అవి ఇంకా అమలు చేయకపోయినా.. ఇవన్నీ లెక్కలోకి తీసుకొని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

    2019లో CAAని అమల్లోకి తెచ్చినప్పుడు.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. 2020 ఆరంభంలో కూడా ఢిల్లీలో అల్లర్లు జరిగాయి. CAA ప్రకారం.. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్‌కి చెందిన.. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు.. 2014 డిసెంబర్ 31లోపు ఇండియాలోకి వచ్చి నివసిస్తున్నట్టయితే.. వారందరికీ భారత దేశ పౌరసత్వం కల్పిస్తామని తెలిపింది.

    కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం.. గుజరాత్‌లోని వదోదర, పటాన్, రాజ్‌కోట్, మార్బీ… ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్, బలోదాబజార్,.. రాజస్థాన్‌లోని జలోర్, ఉదయ్‌పూర్, పాలీ, బార్మెర్, సిరోహీ.. హర్యానాలోని ఫరీదాబాద్,.. పంజాబ్‌లోని జలంధర్‌లో నివసించే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మైనార్టీ శరణార్థులు.. భారత పౌరసత్వం కోసం ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

    కేంద్ర హోంశాఖ చెప్పిన దాని ప్రకారం.. పౌరసత్వం కోసం అప్లికేషన్ పెట్టుకోగానే.. వెంటనే దాన్ని కేంద్రం ఆమోదిస్తుంది. అటు రాష్ట్రాల స్థాయిలో కలెక్టర్ లేదా హోం సెక్రెటరీ అదే సమయంలో ఆమోదిస్తారు. తద్వారా పని త్వరగా అయిపోతుందన్నమాట. ఏవైనా వివరాలు కావాల్సి వచ్చినా, మార్పులు అవసరం అయినా.. ఎప్పటికప్పుడు కేంద్రం వాటిని కోరుతూ ఫైనల్ చేస్తుంది. రాష్ట్రాల స్థాయిలో కలెక్టర్ ఇచ్చిన వివరాలతో సంతృప్తి చెందితే.. పౌరసత్వం కల్పిస్తారు. ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ జారీ చేస్తారు. దాన్ని ప్రింట్ తీసి.. కలెక్టర్ సంతకం చేసి ఇస్తారు.

    ప్రింట్ తీసిన సర్టిఫికెట్‌ను సంబంధిత వ్యక్తికి పంపిస్తారు. అదే సమయంలో.. ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ అలాగే ఉంటుంది. అలాగే కలెక్టర్ దగ్గర కూడా ఓ కాపీ భద్రంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ కాపీ అందుకున్న వ్యక్తి.. దాని కాపీని కేంద్ర ప్రభుత్వానికి వారం లోపు పంపాల్సి ఉంటుంది. ఏవైనా డౌట్లు ఉంటే ఆ వివరాలు కలెక్టర్ చెబుతారు.

    నిజానికి పార్లమెంటులో సీఏఏ ఆమోదం పొంది రెండేళ్లు పూర్తయినా ఆ చట్టానికి సంబంధించిన నిబంధనలు, విధివిధానాలను మోదీ సర్కార్ ఇంకా రూపొందించలేదు. సీఏఏ రూల్స్ లేకుండానే ఇప్పుడు ప్రత్యేక గెజిట్ నోట్ ద్వారా ప్రక్రియను ప్రారంభించడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఇందుకు కారణాలు లేకపోలేదు. పౌరసత్వ చట్టం-1955 కింద, 2009లో చేసిన చట్టంలోని ఒక నిబంధనల కింద ఈ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. సీఏఏ-2019కి రూల్స్ లేనందున ప్రస్తుత నోటిఫికేషన్‌కు ఆ చట్టంతో సంబంధంలేదని కేంద్ర పేర్కొంది.

    Trending Stories

    Related Stories