More

  పాకిస్తాన్ నేవీ దుశ్చర్య.. భారత జాలర్లపై కాల్పులు

  పాకిస్తాన్ నేవీ గుజరాత్‌ తీరంలో ఆదివారం నాడు భారత జాలర్ల పడవపై కాల్పులు జరిపింది. బుల్లెట్‌ గాయాలకు ఓ మత్స్యకారుడు మృతి చెందగా.. మరో మత్స్యకారుడు గాయపడ్డాడు. చనిపోయిన వ్యక్తిని శ్రీధర్‌గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టానికి తరలించారు. గాయపడ్డ మరో వ్యకిని ద్వారకలోని ఆసుప్రతికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎటువంటి హెచ్చరికలు కూడా లేకుండా పాకిస్తాన్ నేవీ తమపై కాల్పులు జరిపిందని జాలర్లు తెలిపారు. పాకిస్తాన్ మెరైన్ కమాండోలు మరో ఆరుగురు మత్స్యకారులను అపహరించారనే వార్తలు వచ్చాయి. గుజరాత్‌లోని ద్వారక దగ్గర ఓఖా పట్టణానికి సమీపంలో భారతీయ మత్స్యకారులు భారతీయ జలాల్లో చేపలు పట్టే సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ కు చెందిన మెరైన్‌ కమాండోస్‌ బోట్‌ వచ్చి ‘జల్‌పరి’ అనే భారత బోటుపై కాల్పులు జరిపారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

  “నా కొడుకు భారత జలాల్లోనే చేపలు పడుతూ ఉన్నాడు” అని శ్రీధర్ తల్లి అనూషా చమ్రే చెప్పుకొచ్చారు. తన కొడుకు ఛాతీపై అనేకసార్లు కాల్పులు జరిపినట్లు తెలిసిందని ఆమె ఏడుస్తూ తెలిపారు. శ్రీధర్ పాల్ఘర్‌లోని వడ్రై మత్స్యకార గ్రామంలో నివసించేవాడు. “నా కొడుకు మూడు నెలల క్రితం జయంతిలాల్ రాథోడ్ అనే పడవ యజమాని దగ్గర ఖలాసీ (చేపల కూలీ)గా ఉద్యోగం చేపట్టాడు. అక్టోబరు 26న, రాథోడ్‌కు చెందిన జల్ పరి పడవ బయలుదేరింది మరియు త్వరలో తీరానికి తిరిగి రావాల్సి ఉంది”అని మత్స్యకారుడు అయిన శ్రీధర్ తండ్రి రమేష్ చెప్పారు. “పాకిస్తాన్ నావికాదళం ఆరుగురు భారతీయ మత్స్యకారులను కిడ్నాప్ చేసిందని మరియు ఒక పడవను స్వాధీనం చేసుకున్నట్లు మేము విన్నాము, అయితే దాని గురించి మాకు ఖచ్చితంగా తెలియదు” అని రమేష్ చెప్పారు.

  పడవలో ఉన్న మరో సభ్యుడు, దిలీప్ టాండెల్ కూడా తుపాకీ గాయంతో ఓఖా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని గుజరాత్ పోలీసులు తెలిపారు. పాక్ నేవీ మెరైన్ కమాండోలపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 303 (హత్య) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ద్వారక పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సునీల్ జోషి తెలిపారు. ఈ సంఘటన సముద్రంలో జరిగినందున, పోర్‌బందర్‌లోని నవీ బందర్ కోస్టల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చారు.

  శ్రీధర్ మృతదేహాన్ని జామ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం పంపారు. సోమవారం సాయంత్రంలోగా పాల్ఘర్ చేరుకునే అవకాశం ఉందని మత్స్యకారుల సంక్షేమ ఫోరమ్, మహారాష్ట్ర మచిమార్ కృతి సమితి ఉపాధ్యక్షుడు మనేంద్ర అరేకర్ తెలిపారు. శ్రీధర్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని.. శ్రీధర్ కుటుంబానికి కేంద్రం మరియు రాష్ట్రం నుండి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీధర్ రోజుకు ₹600 జీతంతో పని చేసేవాడని తెలుస్తోంది.

  మత్స్యకారులు భారత భూభాగంలో ఉన్నందున వారిపై పాక్ నేవీ కాల్పులు జరపాల్సిన అవసరం లేదు. భారతదేశం, పాక్ జలాల మధ్య తేడాను గుర్తించడానికి నిర్దిష్ట గుర్తులు లేవు, కానీ మన దగ్గర GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఉంది, ఇతర దేశాల భూభాగంలోకి వెళితే హెచ్చరిస్తుంది. ఈదురు గాలుల కారణంగా, GPS పనిచేయకపోవడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ భారతీయ మత్స్యకారులకు తమ ప్రాదేశిక పరిమితులు తెలుసని, పాకిస్తాన్ జలాల్లోకి చొరబడరని అరేకర్ చెప్పారు.

  పాకిస్తాన్ ఇండియా పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ సభ్యుడు జతిన్ దేశాయ్ శ్రీధర్ మరణాన్ని పాకిస్థానీ మెరైన్ కమాండోలు చేసిన హత్యగా అభివర్ణించారు. మేము ఈ కాల్పులను ఖండిస్తున్నామని తెలిపారు. ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్) కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ ప్రకారం పాకిస్తాన్ నిబంధనలను ఉల్లంఘించింది.. భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  Trending Stories

  Related Stories