రష్యా సైనిక చర్యల కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో తరలిస్తూ ఉంది. ఎయిర్ ఇండియా విమానాల ద్వారా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తూ ఉన్నాయి. ఇంకా కొందరు ఉక్రెయిన్ లో చిక్కుకున్నారు. వారి తరలింపు కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం ఓ కీలక అడ్వైజరీని జారీ చేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన సామాన్యుల తరలింపునకు మార్గం సుగమమైందని.. తక్షణమే అందుబాటులో ఏ ప్రయాణ మార్గం ఉంటే దాని ద్వారానే ఉక్రెయిన్‌ను వీడాలని ఆ డ్వైజరీలో ఇండియన్ ఎంబసీ భారతీయులను కోరింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారి తరలింపునకు మరో అవకాశం ఉంటుందో, లేదోనని ఆందోళన వ్యక్తం చేసిన ఎంబసీ ప్రస్తుతం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయులను కోరింది. రష్యా సేనల దాడులతో వణికిపోతున్న సుమీ నగరం నుంచి భారత విద్యార్థులందరినీ తరలించామని కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వారిని పోల్టావా తరలిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి వెల్లడించారు. సుమీ నుంచి భారత విద్యార్థులందరినీ తరలిస్తుండడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు. విద్యార్థులు పోల్టావా చేరుకుని అక్కడి నుంచి రైళ్ల ద్వారా పశ్చిమ ఉక్రెయిన్ కు వెళతారని తెలిపారు.
రష్యా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా నిల్చింది. ఇప్పటి వరకు ఈ జాబితాలో ఇరాన్, ఉత్తర కొరియా ఉండగా ఆ దేశాలను రష్యా ఇప్పుడు దాటేసింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అమెరికా, యూరోపియన్ దేశాలన్నీ చేస్తున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్టించుకోకపోవడంతో ఆంక్షలను విధిస్తూ వస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 22 నుంచి అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు ఇప్పటి వరకు 2,778 కొత్త ఆంక్షలను రష్యాపై విధించాయి. ఫలితంగా ఆ దేశంపై ఉన్న మొత్తం ఆంక్షల సంఖ్య 5,530ని దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలపై ఉన్న ఆంక్షలను గణించే కాస్టెలమ్.ఏఐ (Castellum.ai) ఈ వివరాలను వెల్లడించింది.ప్రపంచబ్యాంకు ఉక్రెయిన్ కు భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఆ దేశానికి 723 మిలియన్ డాలర్లు అందించేందుకు ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు.