భారత జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ కు వెళ్లదు

0
968

భారతదేశం మీద పాకిస్థాన్ పన్నుతున్న కుట్రలను ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి. ఇక పాక్ ను అన్ని విధాలుగా భారత్ ఎండగడుతూనే వస్తోంది. క్రీడల విషయంలో కూడా పాక్ కు భారత్ ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూనే వస్తోంది. ముఖ్యంగా క్రికెట్ విషయంలోనూ..! పాక్ క్రికెట్ బోర్డు ఎన్నో దేశాలతో క్రికెట్ ఆడుతున్నా.. ప్రత్యేకంగా పీఎస్ఎల్ పెట్టుకున్నా ఆదాయం మాత్రం రావడం లేదు. భారత్ తో ఒక్క సిరీస్ ఆడితే చాలు.. తమ ఖజానాకు కనకవర్షం కురుస్తుందని భావిస్తోంది. అయితే పాక్ విషయంలో భారత్ కనికరించడం లేదు. పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడకూడదని నిర్ణయించుకుంది. ఇక ఐసీసీ ఈవెంట్స్ లోనూ.. ఆసియా కప్ లోనూ మ్యాచ్ లను ఆడుతూ వస్తోంది. ఇక వచ్చే ఏడాది ఆసియా కప్ ను నిర్వహించే హక్కులు పాకిస్థాన్ కు దక్కినా భారత్ ఆ దేశానికి ఊహించని షాక్ ఇచ్చింది.

భారతజట్టు పాకిస్థాన్ లో నిర్వహించే ఈ టోర్నమెంట్ లో పాల్గొనబోదని బీసీసీఐ తాజాగా తేల్చి చెప్పేసింది. దీంతో పాకిస్థాన్ తటస్థ వేదికల్లో టోర్నమెంట్ ను నిర్వహించాల్సి ఉంటుంది. 2023 ఆసియా కప్ హోస్టింగ్ హక్కులు పాకిస్తాన్‌కు ఇచ్చారు, అయితే ఆ టోర్నమెంట్ లో పాల్గొనడం కోసం భారత జట్టు పాక్ కు వెళ్లదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియా కప్‌ను ఇప్పుడు మరెక్కడైనా నిర్వహించాల్సి ఉంటుందని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు. పాకిస్తాన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లు లేదా పాకిస్థాన్ లో పర్యటించడం చాలా సమస్యాత్మకం.. అక్కడకు వెళ్లడానికి ముందు BCCI కు ప్రభుత్వ అనుమతి అవసరం ఉంటుందని బీసీసీఐ చెబుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా ఉన్న జై షా మాట్లాడుతూ ఆసియా కప్-2023 తటస్థ వేదికలో నిర్వహిస్తామని అన్నారు. భారత జట్టు పాకిస్థాన్ కు వెళ్లలేదని.. వారు ఇక్కడికి రాలేరని జై షా వెల్లడించాడు. గతంలో కూడా ఆసియా కప్ తటస్థ వేదికలో జరిగిందని షా చెప్పుకొచ్చారు.