రోహింగ్యాలను రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్..!

0
728

ఇండియన్ కోస్ట్ గార్డ్ 81 మంది రోహింగ్యాలను ప్రాణాలతో రక్షించింది. అండమాన్ సముద్రంలో ఒక పడవ ఇంజిన్ చెడిపోవడంతో అందులోనే ఇరుక్కుపోయిన రోహింగ్యాలను భారత్ గుర్తించింది. ఇక మరో 8 మంది మృతి చెందినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

బంగ్లాదేశ్‌ కాక్స్ బజార్ నుంచి ఫిబ్రవరి 11వ తేదీన పడవ బయలు దేరింది. 2017లో మియన్మార్‌లో చోటుచేసుకున్న మిలటరీ చర్య సందర్భంగా లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వచ్చి శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నారు. ఇప్పుడు వారే బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌ వైపు వస్తున్న సమయంలో నాలుగు రోజుల పాటు ప్రయాణించిన తర్వాత బోటు ఇంజిన్ ఫెయిల్ అవడంతో సముద్రంలోనే పడవ కొట్టుకుపోయి అండమాన్ తీరం వైపుగా వచ్చింది. అప్పటికే నాలుగు రోజులుగా పడవలో ఉన్న రోహింగ్యాలకు ఆహారం, నీరు దొరకలేదు. అయితే వారిని గుర్తించి రక్షించే సమయానికి చాలామంది నీరసించిపోయి, అనారోగ్యంతో ఉన్నారని విదేశాంగ ప్రతినిధి శ్రీవాత్సవ తెలిపారు.

నడి సముద్రంలో చిక్కుకుపోయిన వారిన కాపాడేందుకు ఇండియన్ కోస్టు గార్డు రెండు నౌకలతో బయలుదేరింది. శరణార్థుల్లో పిల్లలు కూడా ఉన్నారు. వీరిని తిరిగి బంగ్లాదేశ్‌కు పంపేందుకు ఆ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అయితే శరణార్థుల శిబిరాల నుంచి ఇలా ఒక పడవలో వెళ్లినట్లు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఇలా శరణార్థులు పలుమార్లు తప్పించుకునే ప్రయత్నం చేయగా వారి ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుందన్న విషయాన్ని బంగ్లాదేశ్ అధికారులు గుర్తుచేశారు. మలేషియా, ఇండోనేషియాలో మంచి జీవితం ఉంటుందని కొందరు అక్రమార్కులు అమాయకులను నమ్మించి అక్కడి నుంచి అక్రమంగా వీరిని తరలిస్తున్నారని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ 81 మంది భారత భూభాగంలోకి అనుమతించేది లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here