పాకిస్థాన్ కు చెందిన ‘అల్ హజ్’ బోటును పట్టుకున్న భారత్.. అందులో ఏముందంటే

0
775

భారీ ఎత్తున హెరాయిన్ ను కోస్ట్ గార్డు సిబ్బంది పట్టేసుకుంది. 280 కోట్ల విలువైన హెరాయిన్‌తో కూడిన పాకిస్థానీ ఓడ ‘అల్ హజ్’ను ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకుంది. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)తో సంయుక్త ఆపరేషన్‌లో భారత తీర రక్షక దళం సోమవారం గుజరాత్ రాష్ట్ర తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో తొమ్మిది మంది సిబ్బందితో కూడిన పాకిస్థాన్ ఓడను పట్టుకుంది. అందులో ఉన్న రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.పాకిస్థాన్ ఓడ ‘అల్ హజ్’ భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడు భారత తీర రక్షక దళ నౌకలు అడ్డగించి పట్టుకున్నాయని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని, తదుపరి విచారణ కోసం పడవతో పాటు అందులో ఉన్న పాకిస్థాన్ సిబ్బందిని గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని జాఖౌ నౌకాశ్రయానికి తీసుకువచ్చినట్లు రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది సిబ్బందిని పాకిస్థాన్ జాతీయులుగా భావిస్తున్నారు. గుజరాత్ తీరంలోని జాఖావో ఫిషింగ్ హార్బర్ సమీపంలో పడవ ద్వారా హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేశారు. ATS కు పాకిస్తాన్ నుండి డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు సమాచారం అందింది. భారత కోస్ట్ గార్డ్ సహాయంతో సరిహద్దు ఆవల నుండి వస్తున్న పడవను పట్టుకోవడానికి జాయింట్ ఆపరేషన్ చేపట్టింది.