పాక్, చైనా పాలిట సింహస్వప్నం.. ఐబీజీ..!

0
694

శత్రువు తేరుకునేలా విరుచుకుపడటం వీరి నైజం. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా శత్రువును చీల్చిచెండటమే వీరి లక్ష్యం. మంచుశిఖలు మీదపడుతున్నా.. శత్రువు వైపు నుంచి తుపాకీ గుళ్ల వర్షం కురుస్తున్నా.. వెనకడుగు వేయని మెరికలు వీరు. సింహంలా గర్జిస్తూ ముందుకు దూకే సత్తా వారి సొంతం. అసలు ఎవరు వీళ్లంతా అనుకుంటున్నారా..? ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్. భారత సైన్యంలో రూపుదిద్దుకుంటున్న సరికొత్త దళం. సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా మెడలు వంచేందుకు.. త్వరలోనే అందుబాటులోకి రాబోతున్న ఐబీజీ పనితీరు గురించి తెలుసుకునేముందు.. వీటి ఏర్పాటుకు బీజం వేసిన పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. భారత్ ఎక్కువగా ఇన్ ఫ్యాంట్రీ ఆపరేషన్స్ యుద్ధనీతిని అవలంబించేది. శత్రువు మొదట దాడి చేస్తేనే భారత్ ఎదురుదాడికి దిగేది. 1962, 65 వార్ లో ఇదే యుద్ధనీతిని అవలంబించారు. కానీ, ఇలాంటి యుద్ధనీతి వల్ల సమయం వృధా కావడమే కాకుండా.. ఆర్మీ భారీగా నష్టపోవాల్సి వచ్చేది. దీంతో ఎలాంటి ఉపయోగం లేదని గుర్తించిన భారత్.. 1971 వార్ తర్వాత వ్యూహాన్ని మార్చింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం సాగిన ఆ పోరాటంలో తొలిసారి PT-76 ట్యాంకులను ఉపయోగించింది భారత సైన్యం. దీంతో కేవలం 14 రోజుల్లోనే పాకిస్తాన్ ను ఓడించి.. బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యాన్ని సిద్ధింపజేసింది. ఈ యుద్ధంలో ఆక్రమణ వ్యూహాన్ని అమలు పరిచి విజయం సాధించింది.

ఇలాంటి యుద్ధనీతితో కలిగిన ఉపయోగాలను గుర్తించిన భారత సైన్యం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ తర్వాత మెల్లమెల్లగా 1979లో తొలిసారి మెకనైజ్డ్ ఇన్ ఫాంట్రీ యూనిట్ ఏర్పాటు చేసింది. మామూలుగా ఇన్ ఫాంట్రీ యూనిట్ లో కేవలం పదాతి దళాలు మాత్రమే పాలుపంచుకుంటాయి. కానీ, మెకనైజ్డ్ ఇన్ ఫాంట్రీ విభాగంలో సైన్యానికి ట్యాంకులతో పాటు అత్యాధునిక ఆయుధాలు కూడా ఇస్తారు. ఆ తర్వాత ఈ వ్యూహం మరింత బలోపేతమై 2004లో కోల్ట్ స్టార్ట్ వ్యూహంగా రూపుదిద్దుకుంది. ఇటీవలికాలంలో భారత్ ఇలాంటి కోల్ట్ స్టార్ట్ స్ట్రాటెజీని అవలంబించి విజయాలు సాధించింది. ఉరి, పుల్వామా ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ ఇలాంటి వ్యూహాలను అమలుపరిచి విజయం సాధించింది. శత్రువు ఊహించని రీతిలో కౌంటర్ ఎటాక్ చేసి దెబ్బకొట్టడమే కోల్డ్ స్టార్ట్ వ్యూహం. ఈ కోల్డ్ స్ట్రాటెజీ వ్యూహంలో భాగంగానే తొలిసారి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఆలోచనకు బీజం పడింది.

ప్రస్తుతం, ఉగ్రదాడులు పెరిగిపోవడంతో శత్రుదేశానికి వెంటనే జవాబు చెప్పాలంటే.. ప్రస్తుత విధానంలో కష్టమైన పని. దళాలను సరిహద్దులకు తరలించాలంటే చాలా సమయం పడుతోంది. ఈ లోపు శత్రుదేశాల దళాలు అప్రమత్తమైపోతున్నాయి. అదే సమయంలో ప్రపంచదేశాలు కూడా భారత్‌పై దౌత్య ఒత్తిడి పెంచుతున్నాయి. గతంలో 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన సమయంలో కూడా ఇదే విధంగా దళాలను సరిహద్దులకు తరలించే సమయానికి భారత్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో సరిహద్దులు దాటకుండా ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’ను భారత్‌ నిర్వహించింది. కానీ, ఇది ఉగ్రదాడులను ఆపలేకపోయింది. సైనికుల, సరుకుల తరలింపునకు చాలా సమయం పడుతుంది. భారత్‌ వంటి పెద్దదేశంలో మరీ ఈ సమయం ఎక్కువ.

ఈ అంశాలను దృష్టిలోపెట్టుకొని ప్రభుత్వం వ్యూహం మార్చుకొని సైనిక జనరల్‌ పద్మనాభన్‌ తయారు చేసిన కోల్డ్‌స్టార్ట్‌ డాక్టరీన్‌ను అనుసరించడం మొదలుపెట్టింది.

దీనిలో భాగంగా శత్రువు ఏదైన ఉగ్రదాడికి పాల్పడిన వెంటనే ఒక్కసారిగా భారత సైనిక, యాంత్రిక దళాలతో మెరుపుదాడి చేసి కొంత భాగాన్ని ఆధీనంలోకి తెచ్చుకొంటాయి. ఆ తర్వాత చర్చల సమయంలో భారత్‌కు పైచేయి లభిస్తుంది. కవ్వింపు చర్య జరిగిన 72 గంటల్లో దీనిని పూర్తి చేసేయాలి. ప్రపంచ దేశాలు సచేతనమైపోయి దౌత్యఒత్తిడి వచ్చేలోపు శత్రుదేశానికి చెందిన కొంత భూభాగం మన దళాల ఆధీనంలో ఉంటుంది. అందుకు వివిధ విభాగాలకు చెందిన దళాలు సరిహద్దుల్లో సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు భారత్‌ ఇదే వ్యూహానికి పదును పెడుతోంది. దీనికోసమే ఐబీజీలను సిద్ధం చేస్తోంది. ఈ బృందాలు రాజస్థాన్‌, జమ్ము, పంజాబ్‌ ప్రాంతాల నుంచి వేగంగా పాక్‌లోకి చొచ్చకుపోయే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

అసలు ఐబీజీ గ్రూప్స్ ఎలా పనిచేస్తాయి..? వీటికి ఎవరు నేతృత్వం వహిస్తారు..? ప్రతి ఐజీబీ గ్రూప్ ను మేజర్ జనరల్ స్థాయి అధికారి లీడ్ చేస్తాడు. బ్రిగేడ్‌ల కంటే పెద్దగా, డివిజన్ల కంటే చిన్నగా ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూపులను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా బ్రిగేడ్‌లో 3 వేల మంది సైనికులుంటూ, డివిజన్‌లో 12 వేల మంది వరకు ఉంటారు. కానీ, ఐబీజీ గ్రూపులు ఒక్కోదానిలో 5 వేల మంది మెరికల్లాంటి సైనికులు ఉంటారు. వీరిలో పదాతి దళం, ట్యాంకులు, ఫిరంగులు, ఎయిర్‌ డిఫెన్స్, సిగ్నల్స్‌, ఇంజినీర్లు వంటి వివిధ యూనిట్లను కలిపి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్‌ గా ఏర్పాటు చేస్తారు. శత్రువు ఎటాక్ చేసిన కొద్ది గంటల్లోనే.. ఎలాంటి హెచ్చరిక లేకుండా కౌంటర్ ఎటాక్ చేయడం ఐబీజీ గ్రూప్ స్పెషాలిటీ. అదే ప్రస్తుత బ్రిగేడ్ స్థాయి గ్రూప్ ను తీసుకుంటే.. ఇందులో ఒకే వర్గానికి చెందిన సైనికులుంటారు. అంటే పదాతిదళం, ట్యాంకులు, ఫిరంగలు ఇలా వేటికవి ప్రత్యేకంగా వుంటాయి. దీంతో శత్రువు దాడి చేసిన వెంటనే ప్రతిదాడి చేసేందుకు వీలుకాదు. అంటే ట్యాంక్స్ బ్రిగేడ్ వచ్చేవరకు.. పదాతి దళం వేచిచూడాల్సిన పరిస్థితి. అదే, వివిధ వర్గాల సైనికులతో కూడిన ఐబీజీ గ్రూప్ కేవలం 12 నుంచి 48 గంటల్లోపు దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్లగలుగుతుంది.

తొలి దశలో 8 నుంచి 10 ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూపులను తయారుచేసిన తర్వాత భవిష్యత్తులో మరిన్ని గ్రూపుల రూపకల్పన చేయాలని సైన్యం భావిస్తోంది. సరిహద్దుల్లో ఎదురయ్యే సవాళ్లు, అక్కడి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఈ ఇంటిగ్రేటెడ్​ బ్యాటిల్ గ్రూప్​ల రూపకల్పన చేయాలనుకుంటోంది. పాకిస్తాన్ సరిహద్దులవైపు మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ట్యాంకులు, భారీగా ఫిరంగులతో ఐబీజీలను ఏర్పాటు చేయాలని సైన్యం భావిస్తోంది. ఇదే సమయంలో పర్వత ప్రాంతాలున్న చైనా సరిహద్దుల వైపు ఎక్కువగా పదాతిదళం, ఫిరంగులతో కూడిన ఐబీజీలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఐబీజీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. పాకిస్తాన్, చైనాలకు చుక్కలు చూపిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here