భారత్- పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఓ డ్రోన్ కనిపించడంతో.. దాన్ని గుర్తించిన భారత సైన్యం వెంటనే దాన్ని కుప్పకూల్చింది. ‘‘పాకిస్థాన్ సరిహద్దుల నుంచి కథువా జిల్లా రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లి హరియా చెక్ వద్దకు దూసుకొచ్చిన ఓ డ్రోన్‌ను కూల్చేశాం. డ్రోన్‌లో పలు పదార్థాలు ఉన్నాయి. ఆ డ్రోన్ ను బాంబు స్క్వాడ్‌కు చెందిన నిపుణులు పరిశీలిస్తున్నారు’’ అని జమ్మూకశ్మీర్ పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ డ్రోన్ లో ఏడు యూజీసీఎల్ గ్రనేడ్లు, ఏడు మాగ్నెటిక్ బాంబులు ఉన్నట్టు గుర్తించారు. తాలీ హరియా చక్ ప్రాంతంలో భారత గగనతలంలోకి చొచ్చుకుని వచ్చిన ఈ డ్రోన్ ను సెర్చ్ పార్టీ పోలీసులు గుర్తించారు. అమర్ నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరిపేందుకే ఈ డ్రోన్ ద్వారా పాకిస్థాన్ వైపు నుంచి గ్రనేడ్లు, బాంబులు పంపి ఉంటారని అనుమానిస్తూ ఉన్నారు. 43 రోజుల పాటు సాగనున్న అమర్ నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభం కానుంది. జమ్మూకశ్మీర్‌లోని వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ పేలుడు పదార్థాల వంటివి పంపుతూ ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం భారత సైన్యం డ్రోన్లపై నిఘా పెంచేసింది.