భారత వైమానిక దళంలోని సిక్కు పైలట్లు హిందు సీనియర్ల నుండి వేధింపులు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని దుష్ట శక్తులు ప్రచారం చేస్తున్నాయి. మతం ప్రాతిపదికన సిక్కు పైలట్లపై వేధింపులు జరుగుతున్నాయని, దీంతో అనేక మంది సిక్కు పైలట్లు విధులు నిర్వర్తించేందుకు వెనుకాడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ ప్రచారంపై సోమవారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు స్పందించారు. ఇది ఫేక్ న్యూస్ అని ట్విట్టర్ లో ఖండించారు. సిక్కు పైలట్ల విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, తప్పుడు వార్తలను ప్రచారం చేసే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేస్తున్నారని భారత వాయుసేన స్పష్టం చేసింది. ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని అప్రమత్తం చేశారు.
భారతీయ వైమానిక దళంలో ఎంతో మంది సిక్కులు పని చేస్తున్నారు. వారిని ఇతరులు కించ పరుస్తూ ఉన్నారని చేస్తున్న ప్రచారాల వెనుక ఖలిస్థానీల హస్తం కూడా ఉందని అనుమానాలు ఉన్నాయి. భారతదేశం మీద విద్వేషాలను ప్రచారం చేసే పేజీల నుండి ఈ పోస్టులను ఎక్కువగా షేర్ చేశారు. అనేక ఇతర సోషల్ మీడియా వినియోగదారులు కూడా తప్పుడు కథనాలను రీపోస్ట్ చేశారు. స్వార్థ ప్రయోజనాలతో కొందరు తరచుగా భారత వైమానిక దళం, భారత సైన్యంపై తప్పుడు కథనాలను షేర్ చేస్తున్నారు. చైనా, పాకిస్థాన్ దేశాలకు చెందిన కొందరు, కొన్ని సంస్థలు పనిగట్టుకుని మరీ భారతదేశ త్రివిధ దళాల గురించి తప్పుడు ప్రచారం చేయడం కూడా మనం గమనించవచ్చు.