టీ20 సిరీస్ ను కూడా సొంతం చేసుకున్న భారత్..!

0
781

కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్ తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు విజయం సాధించి సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఒకానొక దశలో విండీస్ విజయానికి చేరువవుతూ ఉన్న సమయంలో.. ఆఖరి మూడు ఓవర్లు భారత బౌలర్లు మ్యాచ్ ను తిప్పేశారు. వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా చేజిక్కించుకుంది.

భారత్ నిర్దేశించిన 187 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ లక్ష్యం దిశగా వెళుతూ పోయింది. వికెట్ కీపర్ నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్ అద్భుతంగా ఆడారు. పూరన్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేయగా, పావెల్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. 19వ ఓవర్ మూడో బంతికి పూరన్‌ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. పొలార్డ్ క్రీజులోకి వచ్చినప్పటికీ పరుగులు రాబట్టలేకపోయాడు. ఫలితంగా 178 పరుగుల వద్ద విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 8 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కోహ్లీ, రిషభ్ పంత్ అర్ధ సెంచరీలతో రాణించారు. కోహ్లీ 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ ముందు వచ్చిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు కోహ్లీ. పంత్ 28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేయగా, వెంకటేశ్ అయ్యర్ 18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు.రోహిత్ శర్మ 19 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ (2), సూర్యకుమార్ యాదవ్ (8) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 3 వికెట్లు పడగొట్టగా, కాట్రెల్, రొమరియో చెరో వికెట్ తీసుకున్నారు. రిషభ్ పంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.