లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రెండో టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు మనం ఓడిపోకుండా నిలబడితే చాలు అని మొదట భారత ఆటగాళ్లు భావించారు. ఆ తర్వాత డ్రా అయితే చాలని అభిమానులు అనుకున్నారు. కానీ ఆఖరి 60 ఓవర్లలో భారత్ నుండి మ్యాచ్ ను కాపాడుకుంటే చాలని ఇంగ్లండ్ ఆటగాళ్లు, అభిమానులు కోరుకున్నారు. కానీ చివరికి భారత్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ ను చిత్తు చేసి ఘన విజయాన్ని అందుకుంది. 151 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ ను భారత్ చిత్తు చేసింది. 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ 120 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్ 4 వికెట్లు, బుమ్రాకు 3, ఇషాంత్ కు 2, షమీకి ఓ వికెట్ లభించాయి.. భారత పేస్ బౌలింగ్ అటాక్ ముందు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ నిలబడలేకపోయారు.
మొదటి ఓవర్ నుండి ఇంగ్లండ్ వికెట్లు కోల్పోతూనే వచ్చింది. అయితే కొద్దిసేపు రూట్, ఆఖర్లో బట్లర్ నిలబడి ఇంగ్లండ్ ఓటమిని కొద్దిసేపు ఆపగలిగారు. ఇంగ్లండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్, సిబ్లీ డకౌట్లుగా వెనుదిరగడంతోనే భారత్ మ్యాచ్ లో పట్టు సాధించింది. హమీద్ 9 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. భారత్ మీద అద్భుతంగా ఆడుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 33 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో భారత్ విజయం దిశగా దూసుకెళ్లింది. ఆఖర్లో రాబిన్సన్, బట్లర్ కొద్దిసేపు వికెట్లు పడకుండా ఆపి మ్యాచ్ ను డ్రా దిశగా నడిపించబోయారు. అయితే బుమ్రా స్లో బంతితో రాబిన్సన్ (9) ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో బట్లర్ (25), ఆండర్సన్ (0) లను అవుట్ చేసి భారత్ కు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ లో భారత్ తొలిఇన్నింగ్స్ లో 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 391 పరుగులు నమోదు చేసింది. ఇంగ్లండ్ కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇక భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 298 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో షమీ, బుమ్రా బ్యాటింగ్ అద్భుతమనే చెప్పాలి. షమీ మొత్తం 70 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా 64 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు సాధించాడు. టీమిండియా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు ఆగస్టు 25 నుంచి హెడింగ్లే వేదికగా జరగనుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసింది.