గజ్వా-ఇ-హింద్ కల ఎప్పటికీ సాకారం అవ్వదు.. షరియత్ చట్టాలు, 80-20 వ్యాఖ్యలపై యోగి వివరణ

0
722

ఫిబ్రవరి 14న, వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘గజ్వా-ఇ-హింద్’ అంటూ కలలు కంటున్న వారికి వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ “గజ్వా-ఏ-హింద్ గురించి కలలు కంటున్న వారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది సరి కొత్త భారతదేశం. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు మోదీజీ నాయకత్వంలో ఉంది. ఈ కొత్త భారతదేశంలో, అభివృద్ధి అనేది అందరి కోసం కానీ.. ఎవరికీ బుజ్జగింపుల కోసం కాదు. భారతదేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. షరియత్ చట్టాల ప్రకారం కాదు. గజ్వా-ఇ-హింద్ కల ఎప్పటికీ సాకారం అవ్వదు” అని తేల్చి చెప్పారు.

హిజాబ్ వివాదం గురించి ఆయనను ప్రశ్నించినప్పుడు “భారతదేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎవరి వ్యక్తిగత నమ్మకం, హక్కులు ఉంటాయి..వ్యక్తిగత మతాచారాలను, మతపరమైన నిర్ణయాలను దేశంపైనా, దేశ వ్యవస్థలపైనా రుద్దడం సరికాదు. నేను UPలోని ఉద్యోగులందరినీ కాషాయం ధరించమని అడగవచ్చా? పాఠశాలల్లో డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒక రోజు వారు ఆర్మీ పోలీస్ ఫోర్స్‌లో అదే అడుగుతారు. అక్కడ ఇలాంటివి పనికి రావు.. క్రమశిక్షణ ఉండదు. వ్యక్తిగత నమ్మకం ఉండాలి, కానీ మనం ఒక సంస్థ గురించి మాట్లాడేటప్పుడు, మనం నియమాలు, నిబంధనలను అనుసరించాలి. రాజ్యాంగం ప్రకారం దేశ వ్యవస్థ నడుస్తుంది.” అని మరింత వివరించారు.

భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారంటూ ఏఐఎంఐఎం అధినేత అసస్సుదీన్ ఒవైసీ చేసిన ప్రకటనపై సీఎం యోగి మాట్లాడుతూ.. ముస్లిం మహిళలకు విముక్తి కల్పించేందుకు బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తెచ్చిందని అన్నారు. ముస్లిం మహిళలకు న్యాయం, స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశం షరియత్ కాకుండా రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని మేము చెప్పినప్పుడు, అది ముస్లిం మహిళల శ్రేయస్సు కోసమేనని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. “నేను 80-20 గురించి మాట్లాడినప్పుడు, అది మతం, కులం మొదలైన వాటి గురించి కాదు. 80 శాతం మంది బీజేపీకి ఓటేస్తారని, 20 మంది బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పాను. 80 శాతం మంది ప్రభుత్వ పథకాలతో సంతోషంగా ఉన్నారు. అభివృద్ధిని ఇష్టపడే వారు, పారదర్శకతను ఇష్టపడే వ్యక్తులు. మరోవైపు 20 శాతం మంది నెగెటివ్ థింకింగ్ ఉన్నవారే. వారు నేరస్థులకు మద్దతు ఇస్తున్నారు. వారు తమ ప్రత్యర్థులకు ఓటు వేస్తారు.” అనే ఉద్దేశ్యంతో మాత్రమే వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.

అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని అప్పటి ఎస్పీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు యోగి. 2012లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేశామని, 86 లక్షల మంది రైతుల 36 వేల కోట్ల రుణమాఫీ చేశామని, అక్రమ కబేళాల మూసివేత కూడా జరిగిందని అన్నారు. ఈ మూడు నిర్ణయాలను ఒకేరోజు తీసుకున్నామని సీఎం యోగి తెలిపారు. మహిళల భద్రత కోసం గత ఐదేళ్లలో పోలీసు స్టేషన్లలో మహిళా అధికారుల సంఖ్యను మూడు రెట్లు పెంచామని సీఎం యోగి పేర్కొన్నారు. ప్రతి పంచాయతీకి బ్యాంకింగ్ సౌకర్యం కల్పించేందుకు బ్యాంకింగ్ కరస్పాండెంట్ సఖిని నియమించామన్నారు. తాము చేసిన మంచి పనుల కారణంగా మహిళలు కుల, మతాలకు అతీతంగా బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. శాంతిభద్రతల గురించి సీఎం యోగి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి 3-4 రోజులకు అల్లర్లు జరిగే సమయం ఉండేదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి అల్లర్లు జరగలేదు. గత హయాంలో కర్ఫ్యూలు సాధారణంగా ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి కర్ఫ్యూ విధించలేదన్నారు.

గత ప్రభుత్వాలతో పోలిస్తే రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఎన్నో విధాలుగా కృషి చేసిందని సీఎం యోగి చెప్పారు. గత 70 ఏళ్లలో ఉన్న ప్రభుత్వాలు 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే.. తమ ప్రభుత్వం 35 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల్లో 17 ఇప్పటికే పని చేయడం ప్రారంభించాయని అన్నారు. ‘ప్రతి నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల’ దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. గత 70 ఏళ్లలో రాష్ట్రం ఒకే ఒక్క ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించిందని, అయితే తన ప్రభుత్వం ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలపై పనిచేస్తోందని ఆయన అన్నారు. అఖిలేష్ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రం పథకం కింద 18,000 ఇళ్లను మాత్రమే మంజూరు చేసిందని, ఒక్క ఇళ్లు కూడా నిర్మించలేదని సీఎం యోగి అన్నారు. తమ ప్రభుత్వం పేదలకు 33.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై ఐదు లక్షల మంది భూమిపై హక్కులు పొందారు. 2.6 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించాము. బీజేపీ ప్రభుత్వం 1.43 కోట్లకు పైగా విద్యుత్ కనెక్షన్లు, 1.56 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అందించిందని, 9 కోట్ల మందికి ఏడాదికి 5 లక్షల వైద్యం అందించామని సీఎం యోగి తెలిపారు.

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు:

కాంగ్రెస్‌ను ముంచడానికి బయటి శక్తులు అవసరం లేదని, పార్టీని నాశనం చేయడానికి రాహుల్, ప్రియాంక చాలని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. రాహుల్-ప్రియాంక పార్టీని ముంచడానికి సరిపోతారని అన్నారు. కాంగ్రెస్‌ను ముంచాలంటే మరెవరూ అవసరం లేదు.. రాహుల్-ప్రియాంకలు ఉన్నారని యోగి చెప్పుకొచ్చారు.

యూపీలో అసెంబ్లీ ఎన్నికలు
మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10న జరిగాయి. రెండో దశ ఎన్నికలు ఫిబ్రవరి 14న మొదలైంది. మిగిలిన ఐదు దశలు మార్చి 10 నాటికి ముగుస్తాయి. యూపీ, మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చిలో వెల్లడికానున్నాయి.