భారత్ లో తయారవుతున్న వ్యాక్సిన్ల విషయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) పలు ఆంక్షలను తీసుకొని వచ్చాయి. గ్రీన్ పాస్ పోర్ట్ స్కీమ్ కింద ఈయూ ప్రయాణ ఆంక్షలను సడలించినప్పటికీ భారత్ లో తయారవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను తీసుకున్న వారిని మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. భారతీయులను కూడా యూరప్ దేశాల్లో పర్యటించేందుకు అనుమతించాలని కోరింది భారత ప్రభుత్వం. అందుకు అంగీకరించకుంటే, ఈయూ దేశాలు జారీ చేసే వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తాము అంగీకరించబోమని భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఈయూ నుంచి వచ్చే ప్రయాణికులు భారత్ కు రాగానే తప్పనిసరి క్వారంటైన్ లోకి వెళ్లేలా నిబంధనలను మారుస్తామని భారత్ హెచ్చరించింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను తీసుకున్న వారు చూపించే డిజిటల్ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈయూకు స్పష్టం చేసింది.
ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ దేశాల్లో యూరోపియన్ మెడిసిన్ ఏజన్సీ అనుమతించిన టీకాలను తీసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వాటిల్లో ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా, జాన్సస్ టీకాలు ఉన్నాయి. ఆస్ట్రాజెనికా సంస్థ తయారు చేస్తున్న టీకానే సీరమ్ ఇనిస్టిట్యూట్ ‘కొవిషీల్డ్’ పేరిట తయారు చేస్తుండగా, భారత వర్షన్ ను మాత్రం ఈయూ ఒప్పుకోవడం లేదు.
భారత్ హెచ్చరికలతో కొన్ని యూరోపియన్ దేశాలు దిగొచ్చాయి. ఏడు దేశాలు కొవిషీల్డ్ కు ఆమోదం తెలిపాయి. ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేనియా, గ్రీస్, ఐస్ లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ లు కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు అనుమతినిచ్చాయి. సభ్య దేశాలు తమకు తగ్గట్టు నిబంధనలు మార్చుకోవచ్చని ఈయూ స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఈయూ దేశాలు భారత్ వ్యాక్సిన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని భారత అధికారులు వెల్లడించారు.