భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆగిపోయిన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. వచ్చే ఏడాది జులైలో ఇరు జట్ల మధ్య ప్రారంభం కానున్న వన్డే, టీ 20 సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఇటీవల ఇంగ్లండ్ సిరీస్ కోసం భారత్ వెళ్ళింది. నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ముగిసాయి. 2-1తో భారత్ ఆధిక్యంలో ఉన్న సమయంలో కరోనా కలకలం కారణంగా మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్ట్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ టెస్టు రీషెడ్యూలుకు బీసీసీఐ అప్పట్లోనే ప్రయత్నించినప్పటికీ వీలు పడలేదు. తాజాగా ఈ టెస్టును వచ్చే ఏడాది జులై ఒకటో తేదీకి రీ షెడ్యూల్ చేసినట్టు ఈసీబీ ప్రకటించింది.
జులై 1-5 మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ టెస్టు జరుగుతుందని, అనంతరం 7న ఏజీస్ బౌల్‌లో తొలి టీ20, 9న ఎడ్జ్‌బాస్ట్‌లో రెండో టీ20, ట్రెంట్ బ్రిడ్జ్‌లో 10న మూడో టీ20 జరుగుతాయి. ఆ తర్వాత జులై 12న కియా ఓవల్‌లో తొలి వన్డే, లార్డ్స్‌లో 4న రెండో వన్డే, ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మూడో వన్డే జరుగుతాయి.
రీషెడ్యూలింగ్ ఫలితంగా, ఇంగ్లండ్ మరియు భారత్ మధ్య టీ20 మరియు వన్డే సిరీస్‌లు ఆరు రోజులు వెనక్కి వెళ్లాయి. టీ 20 సిరీస్ బదులుగా జూలై 7 న ఏజాస్ బౌల్‌లో ప్రారంభమవుతుంది, వన్డే సిరీస్ ఇప్పుడు జూలై 12 న ఓవల్‌లో ప్రారంభమవుతుంది.
గత నెలలో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగాల్సిన ఐదవ టెస్ట్ మ్యాచ్ సమయంలో భారత శిబిరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని భారతదేశం ఆందోళన వ్యక్తం చేయడంతో రద్దు చేయవలసి వచ్చింది. భారత అసిస్టెంట్ ఫిజియో యోగేష్ పర్మార్ కరోనా పాజిటివ్ రావడంతో భారత్ ఐదో టెస్ట్ మ్యాచ్ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ క్యాంప్ అప్పటికే ప్రధాన కోచ్ రవిశాస్త్రి లేకుండా మ్యాచ్ ఆడింది. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్ లకు కరోనా వచ్చింది.