భారత్‌కు రష్యాతో దశాబ్దాల మైత్రీ బంధం వుంది. పుతిన్, మోదీల పాలనలో ఆ బంధం మరింత బలోపేతమైంది. రక్షణరంగంలో రష్యా దౌత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి రష్యాకు భారత్ వ్యతిరేకంగా నిలబడింది. రష్యా చేసిన డిమాండ్ ను భారత్ వ్యతిరేకించింది. ఇటీవలికాలంలో భారత్ రష్యాకు వ్యతిరేకంగా ఓటేయడం ఇది రెండోసారి.
తాజాగా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఓటింగ్‌లో రష్యా డిమాండ్‌ను భారత్ వ్యతిరేకించింది. ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్, డొనెట్‌స్క్, ఖేర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను ఇటీవల రష్యా విలీనం చేసుకుంది. ఈ విలీనాన్ని ఖండిస్తూ.. అల్బేనియా తీర్మానాన్ని ప్రతిపాదించింది. రికార్డెడ్ ఓటింగ్‌ను నిర్వహించాలని కోరింది. అయితే ఈ తీర్మానాన్ని రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేపట్టాలంటూ రష్యా డిమాండ్ చేసింది. కానీ.. క్రెమ్లిన్ డిమాండ్‌పై ఓటింగ్ నిర్వహించగా.. 107 దేశాలు తిరస్కరించాయి. 13 దేశాలు మాత్రం రష్యాకు అనుకూలంగా ఓటేశాయి. మరో 39 దేశాలు.. ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అందులో రష్యా, చైనా ఉన్నాయి. అయితే భారత్ మాత్రం.. ఈసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. అయితే, ఇప్పటివరకు రష్యా చర్యలను విమర్శిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు.
అల్బేనియా తీర్మానం స్వీకరించే అంశాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం పున:పరిశీలించాలని రష్యా కోరింది. రష్యా అభ్యర్థనను సర్వసభ్య సమావేశం తిరస్కరించింది. ఈ విషయంలోనూ భారత్ సహా మొత్తం 104 దేశాలు మాస్కోకు వ్యతిరేకంగా ఓటేయగా, 16 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. 34 దేశాలు మాత్రం ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. సర్వసభ్య సమావేశాల్లో తాజా పరిణామాలపై రష్యా శాశ్వత ప్రతినిధి వాసిల్లీ నెబెన్జియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి సభ్యత్వం భారీ మోసానికి చిహ్నంగా మారిందని వ్యాఖ్యానించారు. అధ్యక్ష స్థానంలోని వ్యక్తి ఇందుకు కీలక సూత్రధారి అని పేర్కొన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి మాకు అవకాశం ఇవ్వలేదని.. సభ్యదేశాలు స్వేచ్ఛగా అభిప్రాయాలను చెప్పే హక్కును దోచుకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ.. గత నెలలో కూడా.. అల్బేనియా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఆ ఓటింగ్ మాత్రం భారత్ హాజరుకాలేదు. గతంలోనూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగాన్ని ప్రసారం చేసే విషయంలో జరిగిన ఓటింగ్‌ను రష్యా వ్యతిరేకించింది. ఈ తీర్మానంలోనూ మాస్కోకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది.
ఏదేమైనా రష్యా చేసిన డిమాండ్ ను తిరస్కరిస్తూ భారత్ ఓటు వేయడంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని యూఎన్‌జీఏ ప్రకటించింది. మాస్కో చేసిన సవాలుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వంద దేశాలలో భారతదేశం ఒకటి అని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జరగబోయే ఓటింగ్ కు భారత్, రష్యాకు మళ్లీ షాక్ ఇవ్వనుందా..? లేదంటే తటస్థ వైఖరిని అవలంబించనుందా..? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదిలావుంటే, ఉక్రెయిన్‌లోని రష్యా సేనల భీకర దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యలను ఇరుదేశాలు.. దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని సూచించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న తీవ్రతలను తగ్గించే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సంక్షోభం తీవ్ర రూపం దాల్చడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. తాజాగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్ పౌరుల మరణాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శత్రుత్వం మరింత పెంచుకోవడంతో ఎవరికీ ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. విరోధాన్ని వీడి వెంటనే దౌత్యపరంగా, చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఉద్ధృతిని తగ్గించే అటువంటి ప్రయత్నాలకు మద్దతిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
రష్యా, క్రిమియాను కలిపే కెర్చ్ వంతెన పేలుడుపై.. క్రెమ్లిన్ రగిలిపోయింది. ప్రతీకారంగా ఉక్రెయిన్ పై ఏకంగా 84 క్షిపణులతో దాడులకు దిగింది. తాజా దాడులతో ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం ప్రారంభమైన ఈ 8 నెలల్లో ఇంత తీవ్రస్థాయిలో రష్యా దాడికి దిగడం ఇదే మొదటిసారి. రష్యా దాడుల్లో 8 మంది ప్రాణాలను కోల్పోయారని.. 50 మందికి పైగా గాయాల పాలైనట్టు ఉక్రెయిన్ తెలిపింది. ప్రధానంగా మౌలిక సదుపాయాల కేంద్రాలపైనే రష్యా దాడులకు దిగుతోంది. దీంతో విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఉక్రెయిన్ వెల్లడించింది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం.. 250 రోజులకు చేరువవుతోంది.
ఈ యుద్ధంలో ఇటీవల రష్యాకు భారీగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఖార్కివ్, లుహాన్‌స్క్‌లో ఎదురుదెబ్బలు తగిలాయి. మాస్కో సైన్యం ఆయా ప్రాంతాల్లో పారిపోయాయి. దీంతో నాటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. యుద్ధంలోకి 3 లక్షల మందిని దింపుతానని ఇటీవల పుతిన్ ప్రకటించాడు. ఈ నెల 8న రాత్రి ఖార్కివ్‌పై క్రెమ్లిన్ మానవ రహిత డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కెర్చ్ బ్రిడ్జిపై పేలుడు జరిగింది. ఈ ఘటనలో 3 మరణించారు. కెర్చ్ బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతిన్నది. కెర్చ్ బ్రిడ్జిపై దాడి చేసింది ఉక్రెయినే అని.. ఇది ఉగ్రవాద చర్యగా పుతిన్ అభివర్ణించారు. దీనికి ప్రతీకార దాడులు చేస్తామని ప్రకటించారు. అనుకున్నట్టుగానే ఉక్రెయిన్‌పై వేర్వేరు నగరాలపై బీకర దాడులకు దిగారు.
తాజా పరిణామాల నేపథ్యంలో.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇక ముందు భారత్ ఎలా వ్యవహరించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రష్యా మనకు నమ్మదగిన మిత్ర దేశం. అక్కడి నుంచి చవకగా భారీ ఎత్తున క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటోంది భారత్. మన విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా మొన్ననే ఐక్యరాజ్య సమితిలో ఆస్ట్రేలియా ప్రతినిధితో మాట్లాడుతూ.. భారత్ కు అమెరికా, పాశ్చాత్య దేశాల కంటే రష్యాయే నమ్మదగిన మిత్రుడని అన్నారు. ఈ నేపథ్యంలో భారత్ – రష్యా మైత్రి మున్ముందు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.