ఆఫ్ఘనిస్తాన్‌లో లక్షలాది మంది తీవ్రమైన ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన అనేక దేశాలు ఆదుకోడానికి ముందుకు వచ్చాయి. భారతదేశం కూడా ఆఫ్ఘనిస్తాన్‌కు 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. భారత్ నుంచి పాక్ మీదుగా గోధుమలను సరఫరా చేసేందుకు 5వేల ట్రక్కులను వినియోగిస్తోంది. ట్రక్కుల్లో గోధుమలను నింపి పాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు రోడ్డు మార్గం ద్వారా చేరవేయాలి. అయితే పాక్ మరోసారి తన బుద్ధిని చూపించింది. పాక్‌లోకి ప్రవేశించిన ట్రక్కులను అక్కడిఅధికారులు నిలిపివేశారు. ఆహారధాన్యాలను ఆఫ్ఘనిస్తాన్ కు అందజేసేందుకు తీసుకెళ్తున్నామని భారత్ ఇప్పటికే పాక్‌కు సమాచారం ఇచ్చింది. అయినప్పటికి ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. భారత్ ట్రక్కులు పాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లేందుకు లాజిస్టిక్ రూల్స్ ఒప్పుకుంటాయా లేదా అని పరిశీస్తున్నట్టు పాక్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అనుమతి కోసం భారత్ కు చెందిన లారీలు పడిగాపులు కాస్తున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను తీసుకువెళ్లే ట్రక్కులను తరలించడానికి అనుమతించమని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు లేఖ పంపింది. చైనా, టర్కీ వంటి కొన్ని దేశాలు గత కొన్ని వారాలుగా ఆఫ్ఘన్ లకు ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభించాయి. 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను ఆఫ్ఘనిస్తాన్ కు తరలించేలా పాక్ మీదుగా 5,000 ట్రక్కులను పంపాల్సి ఉంటుందని ఢిల్లీ అధికారులు చెప్పారు. భారతీయ ట్రక్కులను అనుమతించాల్సి ఉంటుందని, లేదంటే వాఘా-అట్టారీ సరిహద్దులోని జీరో పాయింట్ వద్ద గోధుమలను అన్‌లోడ్ చేసి మళ్లీ పాక్ ట్రక్కుల్లోకి ఎక్కించాల్సి ఉంటుంది. అయితే భారత్ అభ్యర్థనకు పాక్ నుంచి ప్రతిస్పందన రాలేదు. భారత్ సహాయాన్ని స్వీకరించడానికి తాలిబాన్లు సిద్ధంగా ఉన్నా పాకిస్తాన్ మాత్రం ఇలా అడ్డుగా నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ కు సాయం చేస్తామని పాక్ చెబుతూ ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఇలా ఆ దేశానికి సాయం చేసే వారిని అడ్డుకుంటూ ఉంది.