వీసాలు రద్దు చేసి చైనాకు షాకిచ్చిన భారత్..!

0
954

ఒకప్పుడు అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాలు గద్దిస్తే.. ఘనత వహించిన గత పాలకులకు ముచ్చెమటలు పట్టేవి. ఆ దేశాలను కాదని ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా.. వణికిపోయేవారు. మనకు ఎంత చేటు చేసినా.. మారుమాట్లాడేవారు కాదు. పల్లెత్తు మాట అనడానికి పదిసార్లు ఆలోచించేవారు. కానీ, ఇప్పుడు అంతా రివర్స్ లో జరుగుతోంది. దేశ సార్వభౌమాత్వం, సమగ్రతలకు ముప్పు వాటిల్లేలా, ఏ దేశం ప్రవర్తించినా,.. చెంపచెల్లుమనేలా సమాధానం చెబుతోంది భారత్. దేశ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే.. అక్కడికక్కడే కౌంటర్ ఎటాక్ చేస్తోంది.

తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. మన విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన జిత్తులమారి చైనాకు భారత్ భారీ ఝలక్ ఇచ్చింది. విదేశాంగ తీసుకున్న కఠిన నిర్ణయంతో డ్రాగన్ కంట్రీ షాక్ తిన్నది. చైనా పౌరులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలను ఉన్న ఫళంగా రద్దు చేసింది భారత్. అంతేకాదు, పదేళ్ల కాలవ్యవధి కలిగిన వీసాలు ఇకపై ఏ మాత్రం చెల్లుబాటు కావని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ సర్క్యులర్ ను కూడా విడుదల చేసింది. భారత్‎లో పర్యటించడానికి ఏ ఏ దేశాల పౌరుల అర్హులో సర్క్యులర్ లో సవివరంగా తెలిపింది. IATA అనేది గ్లోబల్ ఎయిర్‌లైన్స్ బాడీ, దీనిలో దాదాపు 290 మంది సభ్యులు ఉన్నారు. ఇది గ్లోబల్ ఎయిర్ ట్రాఫిక్‌లో 80 శాతానికి పైగా కలిగివుంది. IATA జాబితాలో తమ దేశం పేరు లేకపోవడంతో చైనా షాకైంది.

ఇటీవల భారతీయ విద్యార్థులను చైనా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సుమారు 22 వేల మంది భారత విద్యార్థులు చైనాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. కొవిడ్ కారణంగా 2020 ప్రారంభంలో వీరంతా స్వదేశానికి వచ్చేశారు. రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే భౌతిక తరగతులకు హాజరవ్వడానికి విద్యార్థులు అభ్యర్థిస్తున్నప్పటికీ చైనా వారిని అనుమతించడం లేదు. ఇప్పటి వరకు వారికి అక్కడి విశ్వవిద్యాలయాలు ఎలాంటి సమాచారం తెలపడం లేదు. ఇదే విషయంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చైనాను సంప్రదించింది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని.. సానుకూలంగా వ్యవహరించాలని కోరింది. మార్చి 17న భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్వయంగా చైనాకు విజ్ఙప్తి చేశారు. చైనా సానుకూలంగా స్పందిస్తుందని కేంద్రం ఆశించింది కూడా. కానీ, ఆశించినట్టు జరగలేదు. చైనా భారతీయ విద్యార్థుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతేడాది సెప్టెంబర్‎లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయినప్పుడు కూడా దీనిపై చర్చ జరిగింది. కానీ, చైనా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కడుపుమండిన భారత్.. చైనా వీసాలు రద్దు చేస్తూ కఠిన నిర్ణయాన్ని ప్రకటించింది.

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత.. కొందరు భారతీయ విద్యార్థులు తిరిగి చదువుకునేందుకు తిరిగి చైనాలో అడుగుపెట్టారు. అయితే, వారి రాకను నిషేధించింది చైనా. అయితే, తన మిత్రదేశం పాకిస్తాన్‌ తో పాటు,. శ్రీలంక, థాయిలాండ్‌ వంటి కొన్ని దేశాలకు మాత్రం అనుమతించింది. ఆ దేశాల నుంచి వచ్చే విద్యార్థులను మాత్రం ఆహ్వానించింది. మార్చిలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ భారత పర్యటన సందర్భంగా కూడా మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయాన్ని లేవనెత్తారు. విద్యార్థుల సమస్యను పరిష‍్కరించాలని కోరారు. అయినప్పటికీ చైనా నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇక లాభం లేదనుకున్న భారత్.. పర్యాటక వీసాలను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20న జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం.. చైనా పౌరులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవు. భూటాన్, మాల్దీవులు, నేపాల్ జాతీయులు, భారత్‌ జారీ చేసిన నివాస అనుమతి ఉన్నవారు, ఈ-వీసా ఉన్నవారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు, బుక్‌లెట్, పీఐవో కార్డు ఉన్నవారు,.. దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లకు మాత్రమే భారత్‌లోకి అనుమతి ఉంటుందని వెల్లడించింది.

విద్యార్థుల విషయంలోనే కాదు, గతంలో చైనా నుంచి దిగుమతులపై ఆంక్షలు, పన్నులు విధించింది. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ నుంచి చౌకగా దిగుమతి అవుతున్నవటువంటి కొన్ని ఉత్పత్తులపై భారత్ యాంటీ డంపింగ్ పన్నులు విధించింది. స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండటానికి ఇలా చేసింది. హైడ్రోఫ్లోరో కార్బన్‌, సోడియం హైడ్రో సల్ఫేట్‌, అల్యూమినియం, సిలికాన్‌ సీలెంట్‌, హైడ్రో ఫ్లోరో కార్బన్‌ మిశ్రమాలు వంటివి ఉన్నాయి. అంతేకాదు, కొత్తగా విధించిన సుంకాన్ని భారతీయ కరెన్సీలో చెల్లించాలని సీబీఐసీ స్పష్టం చేసింది.

ఇదిలావుంటే, చైనా వల్ల భారతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. విదేశీ చదువులపై భారత్ ఇకపై కఠినంగా వ్యవహరించే అవకాశం వుంది. కఠిన నిబంధనలు రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తాజాగా పాకిస్తాన్ కు కూడా షాకిచ్చింది భారత్. ఉన్నత చదువుల కోసం పాకిస్తాన్ కు వెళ్లేవారికి పరోక్ష హెచ్చరికలు చేసింది. పాకిస్తాన్ లో చదవకూడదని.. అక్కడి డిగ్రీలు భారత్ లో చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుబంధ విభాగాలనై యూజీసీ, ఏఐటీసీ ఈ విషయంపై సంయుక్త ప్రకటన చేశాయి. పాక్ డిగ్రీలతో భారత్‌లో పై చదువులు చదవడం కానీ, ఉద్యోగాలు పొందడం కానీ చేయలేరని చెప్పింది. అయితే, పాకిస్తాన్ నుంచి భారత్ వలస వచ్చిన విద్యార్థులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుందని ప్రకటనలో యూజీసీ, ఏఐసీటీఈ పేర్కొన్నాయి. దీనికోసం భారత్ జారీచేసే సెక్యూరిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలని చెప్పింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

four × one =