International

పాకిస్తాన్ లో గణేష్ మందిరంపై దాడిని ఖండించిన పాక్ ప్రధాని

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని విఘ్నేశ్వరుడి ఆలయాన్ని ఓ బృందం ధ్వంసం చేసింది. ఆలయంలోని చాలా భాగాలు దగ్ధమయ్యాయి. విగ్రహాలను అపవిత్రం చేశారు. రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో బుధవారం నాడు ఈ దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనపై భారత్ కూడా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.

హిందూ దేవాలయం విధ్వంసంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్.. పాకిస్థాన్ అగ్ర దౌత్యవేత్త, పాకిస్తాన్ చార్జి డి అఫైర్స్ (C’DA) పై ఒత్తిడిని తీసుకుని వచ్చింది. “ఈ ఖండించదగిన సంఘటన పట్ల తాము తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తున్నామని.. అంతేకాకుండా దృఢమైన నిరసన తెలియజేస్తున్నామని.. మైనారిటీ కమ్యూనిటీ యొక్క మత స్వేచ్ఛను కాపాడాలి, వారి ప్రార్థనా స్థలాలపై దాడులను అడ్డుకోవాలని” అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. పాకిస్తాన్ లో మైనారిటీ వర్గాల భద్రత, శ్రేయస్సు విషయంలో హామీ ఇవ్వాలి అని ఎం.ఇ.ఏ. ప్రతినిధి అన్నారు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఆ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా ప్రసారం చేయబడింది.

పాకిస్తాన్ లో మైనారిటీల మీద చోటు చేసుకుంటున్న దాడులలో ఇది ఒక భాగమని పలువురు విమర్శించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు ఈ ఘటనపై స్పందించారు. ట్విట్టర్‌లో ఈ ఘటనను ఖండించారు. నేరస్థులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆలయాన్ని పునరుద్ధరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. నేరస్థులందరినీ అరెస్టు చేయాలని మరియు పోలీసుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని హిందూ దేవాలయంపై దాడి:

ఆగస్టు 4 న (బుధవారం) పాకిస్తాన్‌లోని గణేష్ ఆలయంపై దాడి జరిగిన తీరు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని గణేష్ ఆలయాన్ని వందలాది మంది ఎలా ధ్వంసం చేశారో వీడియోలు బయటకు వచ్చాయి. ఆలయంలోని కొన్ని భాగాలు దగ్ధమయ్యాయి మరియు విగ్రహాలు అపవిత్రం చేయబడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్లమెంటేరియన్ డాక్టర్ రమేష్ కుమార్ వాంక్వానీ ట్విట్టర్‌లో దేవాలయంపై దాడి వీడియోలను పోస్ట్ చేశారు. దేవాలయాల విధ్వంసాలు చేయడం ఆపాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు. వీడియోలలో చూస్తే ఆలయంపై కర్రలు, రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. మతపరమైన నినాదాలు చేస్తూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేశారని వాంక్వానీ అన్నారు. వరుస ట్వీట్లలో ఆలయంపై దాడిని ఖండించారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చీఫ్ జస్టిస్ చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

fourteen − five =

Back to top button