అరుణాచల్ ప్రదేశ్ లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటిస్తూ ఉన్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై బుధవారం చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము భారత్‌లో అంతర్భాగంగా భావించని అరుణాచల్‌లో ఉప రాష్ట్రపతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 9న వెంకయ్యనాయుడు ఆ రాష్ట్రంలో పర్యటించి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిన ఈశాన్య భారతంలో ఇప్పుడు అభివృద్ధి బాగా జరుగుతోందని వెంకయ్య చెప్పుకొచ్చారు. అనేక మౌళిక సదుపాయాలను భారత ప్రభుత్వం అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిందని తెలిపారు.
వెంకయ్య నాయుడు పర్యటనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడుతూ.. సరిహద్దు అంశంలో చైనా స్థిరమైన, స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. చైనా ప్రభుత్వం ఎప్పుడూ అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో రాష్ట్రంగా గుర్తించలేదు. ఇండియానే అక్రమంగా, ఏకపక్షంగా అరుణాచల్ ప్రదేశ్‌ను రాష్ట్రంగా గుర్తించింది. ఆ ప్రాంతంలో భారత నేత పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
చైనా వైఖరిపై భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. చైనా అభ్యంతరాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో విడదీయలేని అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. భారత్ నేతలు అక్కడ పర్యటిస్తే చైనా అభ్యంతరం చెప్పడం అర్థంపర్థం లేని పని అని కొట్టిపారేశారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్లుగానే అరుణాచల్‌లోనూ పర్యటిస్తారని, ఇందులో మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం మరియు విడదీయరాని భాగం అని.. మిగతా ప్రాంతాల్లో పర్యటించినట్లే ఆ రాష్ట్రంలోనూ నేతలు పర్యటిస్తారని చైనాకు భారత్ తేల్చి చెప్పింది.