పాకిస్తాన్ ఒక్కటే ఉగ్రవాదాన్ని ప్రొత్సహించే దేశం అనుకుంటే పొరపాటే. ఆ దేశానికి నిత్యం అండగా నిలిచే డ్రాగన్ దేశం కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తోందని మరోసారి రుజువైంది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఇండియా, అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా చివరి నిమిషంలో అడ్డుకున్నది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐసిస్, ఆల్ ఖైయిదా ఆంక్షల కమిటీ కింద ఉగ్రవాది మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఇండియా, అమెరికా ప్రతిపాదన చేశాయి. అయితే ఆ ప్రయత్నాలను చైనా అడ్డుకుంది. సెప్టెంబర్ 26 దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు మక్కి సోదరుడవుతాడు. మక్కిని ప్రత్యేకమైన గ్లోబల్ టెర్రరిస్ట్‌గా చేస్తూ అమెరికా ట్రెజరీ శాఖ 2010 నవంబర్‌లో ప్రకటన చేసింది. దాని ప్రకారం మక్కీ ఆస్తుల్ని సీజ్ చేశారు. అమెరికన్లు ఎవరు కూడా మక్కితో లావాదేవీలు నిర్వహించరాదు. మక్కి తలపై రెండు మిలియన్ల డాలర్ల రివార్డును కూడా అమెరికా ప్రకటించింది. లష్కరే సంస్థ కోసం నిధులను సమీకరించినట్లు మక్కిపై ఆరోపణలు ఉన్నాయి.
అయితే గతంలోనూ పాక్ ఉగ్రవాదులను నిషేధిత జాబితాలో చేర్చుతున్న సమయంలో ఆ ప్రయత్నాలను చైనా అడ్డుకుంది. పఠాన్‌కోట్, పుల్వామా టెర్రర్ దాడుల సూత్రదారి, జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించడాన్ని చైనా అడుగడుగునా అడ్డుకుంది. ఆ తర్వాత పదేళ్ల పాటు ఇండియా పోరాటం చేయడంతో డ్రాగన్ దేశం తలవంచక తప్పలేదు. చివరికి 2019లో తీర్మానానికి ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోద ముద్రవేసింది. అప్పటి నుంచి మసూద్ అజార్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించారు.
టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న మసూద్ అజార్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలన్న ప్రతిపాదన ఐక్యరాజ్యసమితిలో 10 ఏళ్ల నుంచి కొనసాగింది. 2009లో ఇండియానే ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ ముందుకు సాగలేదు. 2016లో మళ్లీ ఇండియానే ఈ అంశాన్ని లేవనెత్తింది. 1999లో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదించిన 1267 తీర్మానాన్ని అనుసరించి అజార్‌పై చర్యలు తీసుకోవాలని పట్టుపడుతూ వచ్చింది. అజార్ విషయంలో ఇండియాకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా మద్దతిస్తున్నప్పటికీ చైనా మాత్రం అడ్డుపుల్లలు వేస్తూ వచ్చింది. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన టెర్రర్ అటాక్‌తో ఇండియా తన స్వరాన్ని మరింత పెంచడంతో చైనా తీరులో మార్పు వచ్చింది.
జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజార్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలన్న ఇండియా ప్రతిపాదనకు ప్రతిసారి చైనా అడ్డుపడుతూనే వచ్చింది. సాంకేతిక కారణాలు చెప్తూ ప్రతిపాదనను ముందుకు పోనివ్వలేదు. సంప్రదింపులతోనే సమస్య పరిష్కారమవుతుందని వాదిస్తూ వచ్చింది. తన మిత్ర దేశం పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాల దృష్ట్యా అది ఇలా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా తనకు దక్కిన వీటో అధికారంతో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాన్ని బ్లాక్‌లిస్టులో పెట్టింది. అప్పుడు ఇండియాకు తోడుగా ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ కూడా చైనాపై ఒత్తిళ్లు తెచ్చాయి. వీటో పవర్‌ను ఉపయోగించి ఇన్నాళ్లూ ఇండియా ప్రతిపాదనను అడ్డుకున్న చైనా.. అదే వీటో పవర్నుఉపయోగించి ఇతర దేశాలు తనను ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి తొలగిస్తే ఏమిటన్న సందేహంలో పడింది. దీంతో తన పాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కౌన్సిల్ దృష్టికి తెచ్చింది. ఇప్పుడు కూడా అదే ధోరణితో మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించకుండా అడ్డుపడటం భారత్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.