సరిహద్దుల్లో అదనంగా 50వేల మంది భారత సైనికులు

సరిహద్దుల్లో చైనా చేస్తున్న దురాగతాలను భారత్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఉంది. బోర్డర్ లో చైనాకు ధీటుగా బలగాలను తరలిస్తూ ఉంది భారత్. ఎప్పటికప్పుడు చైనా కదలికలను భారత్ గమనిస్తూనే ఉంది. తాజాగా భారత సైన్యం 50000 మంది సైన్యాన్ని అదనంగా చైనా సరిహద్దుల్లోకి తరలించింది. చైనా సరిహద్దుల్లోకి అదనంగా మరో 50 వేల మంది సైనికులను పంపిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఫైటర్ జెట్స్ ను కూడా సరిహద్దులకు తరలించింది.
చైనా సరిహద్దుల్లోని మూడు వ్యూహాత్మక ప్రాంతాలకు భారత్ బలగాలను తరలించింది. ప్రస్తుతం బోర్డర్లలో 2 లక్షల మంది సైనికులు విధుల్లో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. 1962 లో హిమాలయాలలో రెండు దేశాలు తలపడ్డాయి. బ్రిటీష్ వారు ఉపఖండాన్ని విడిచిపెట్టినప్పటి నుండి భారతదేశం యొక్క వ్యూహాత్మక దృష్టి ప్రధానంగా పాకిస్తాన్, వివాదాస్పదమైన కాశ్మీర్ ప్రాంతంపై ఉంది. ఇటీవలి కాలంలో చైనా ఎన్నో కుతంత్రాలను పన్నుతూ ఉంది. భారత భూభాగాన్ని ఆక్రమించుకోడానికి చాలా ప్రయత్నాలనే చేస్తూ ఉంది. చైనా దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నాలను చేస్తూనే ఉంది. సైనిక పరంగా, అణ్వాయుధాల పరంగా భారత్ బలంగా ఉండటంతో, నేరుగా ఢీకొనేందుకు చైనా వెనకడుగు వేస్తోంది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు. ఈ నేపథ్యంలో సరిహద్దులకు భారత ప్రభుత్వం బలగాలను పెద్ద సంఖ్యలో తరలించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే దిశగా కార్యచరణను కొనసాగిస్తోంది. క్షణాల్లో సైనికులను సరిహద్దుల్లోకి తలించేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లను మోహరింపజేసింది. ఇటీవల హిమాలయా రీజన్ లో వారి సైనిక కదలికలు ఎక్కువయ్యాయనే వార్తలు రావడంతోనే భారత్ కూడా బలగాలను పెద్ద ఎత్తున తరలించినట్లు తెలుస్తోంది.
గతంలో భారతదేశం చైనా ఎత్తుగడలను నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు మాత్రం భారత సైన్యానికి అన్ని హక్కులను భారత ప్రభుత్వం ఇచ్చింది. చైనా తోక జాడిస్తే ధీటుగా బదులివ్వాలని భారత సైన్యం సిద్ధంగా ఉంది. ఇంతకు ముందు గాల్వన్ లోయలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చైనా సైనికులు భారత సైన్యంపై దాడి చేయడం.. భారత సైనికులు అంతకంటే ఎక్కువగా చైనా సైన్యంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికి కూడా మరణించిన తమ సైనికుల సంఖ్యను చెప్పలేకపోతోంది. ఇప్పుడు కూడా చైనా సైనిక చర్యలకు అదే స్థాయిలో బదులివ్వాలని భారత్ భావిస్తోంది.