భారత విదేశాంగ శాఖ జర్మనీకి చెంప ఛెళ్ళు మనిపించేలా సమాధానం చెప్పింది. పాక్ లాంటి ఉగ్రదేశానికి సమర్థించినందుకు.. భారత్ అంతే దీటుగా సమాధానం చెప్పింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీతో జర్మనీలో భేటీ అయిన ఆ దేశపు విదేశాంగమంత్రి భారత్‌పై కారుకూతలు కూసింది. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. అదే రీతిలో సమాధానం చెబుతూ నోరు మెదపకుండా చేసింది. ఇటీవలే వీరిద్దరి భేటీ తర్వాత బెర్లిన్ లో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బోక్ సమక్షంలో మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జమ్ము కశ్మీర్ సమస్యపై ఐక్యరాజ్యసమితిలో చర్చ జరగాలని వ్యాఖ్యానించాడు. జమ్ము కశ్మీర్ సమస్య పరిష్కరించబడకపోతే దక్షిణాసియాలో శాంతి కొనసాగలేదని సన్నాయి నొక్కులు నొక్కాడు. ఐక్యరాజ్య సమితిలో చర్చల వల్లే జమ్ముకశ్మీర్ లో ప్రజలకు న్యాయం జరుగుతుందని చిలక పలుకులు పలికాడు. దీనికి వంత పాడుతూ జర్మనీ విదేశాంగ మంత్రి కూడా ఉచిత వాక్కులు పలికింది. రెండు దేశాల మధ్య ఘర్షణలను పరిష్కరించుకోకుంటే ప్రపంచంలో శాంతిని సాధించలేమని పేర్కొంది.
ఇక ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తన ట్విట్టర్ లో జర్మనీకి గట్టిగా బుద్ది చెప్పారు. రెండు దేశాల పేర్లను ఎక్కడా చెప్పకుండానే వాటికి చురకలంటించారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని బాద్యత గల అన్ని దేశాలు వ్యతిరేకించాలని తేల్చిచెప్పారు. మరీ ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఏదేశమూ అంగీకరించదని పేర్కొన్నారు. జమ్ము కశ్మర్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదంతో సతమతమవుతోందని వ్యాఖ్యానించారు. భారత్ లోకి వస్తున్న ఈ ఉగ్రవాదం వల్ల దేశం మొత్తం దీనికి బలైపోతోందన్నారు. ఈ దాడుల్లో కేవలం భారతీయులే కాకుండా విదేశీయులు కూడా బాధితులయ్యారని గుర్తు చేశారు. అంతేకాదు 9/11 దాడులపై ఐక్యరాజ్యసమితితో పాటు ఎఫ్ఏటీఎఫ్ లు కూడా పాకిస్తాన్ ను వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో జర్మనీ ఉగ్రదేశానికి మద్దతిస్తే భారత్ ఏవిధంగా అడ్డుకుంటుందో తెలియజేసింది. పాకిస్తాన్ లాంటి దేశాలతో చేరితే జర్మనీ ను కూడా ఉగ్రవాదానికి సహకారమందిస్తున్న దేశంగా గుర్తించే అవసరం ఏర్పడుతుందని తెలియజేసినట్లయింది. ఇదే తడవుగా సీమాంతర ఉగ్రవాదం గురించి భారత్ తన స్పష్టమైన వైఖరి గురించి మరోసారి తెలియజేసింది.
ఇక ఇటీవలే జమ్ము కశ్మీర్ లో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదే విషయాన్నే వెల్లడించారు. పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల కశ్మీర్ లో ఇప్పటివరకు 45 వేల మంది ప్రజలు మరణించారని తెలిపారు. ఇంత మంది మరణానికి కారణమైన పాకిస్తాన్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదనే విషయాన్ని అమిత్ షా ప్రపంచదేశాలతో పాటు భారత్ లోని ప్రతిపక్షాలకు కూడా స్పష్టం చేశారు.
కొద్ది రోజుల క్రితం కూడా ఐక్యరాజ్యసమితిలో టర్కీ విషయంలోనూ భారత్ దీటుగానే సమాధానం చెప్పింది. ఐక్యరాజ్యసమితిలో టర్కీ కశ్మీర్ విషయాన్ని ప్రస్తావించడంతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ టర్కీ విదేశాంగమంత్రి తో భేటీ అయి సైప్రస్ సార్వభౌమాధికారాన్ని భారత్ గుర్తిస్తుందని తేల్చి చెప్పారు. అంతే కాదు టర్కీ డ్రోన్లను అజర్భైజాన్ ఉపయోగిస్తుండటంతో వాటిని ఎదుర్కునేందుకు ఆర్మేనియాకు పినాక మిస్సైళ్ళను కూడా సరఫరా చేస్తోంది. ఈ విధంగా కశ్మీర్ గురించి ప్రస్తావించే ప్రతి దేశానికీ జైశంకర్ ధీటుగానే సమాధానం చెబుతున్నారు. ఇక జర్మనీ కూడా ఈ వ్యాఖ్యలు ఇప్పటికి ఆపకపోతే టర్కీ లాగే జర్మనీకు కూడా షాక్ ఇచ్చే అవకాశముంది. జర్మనీలో అతి పెద్ద రాష్ట్రమైన బవారియాలోని ప్రజలు ఇప్పటికే ఆ దేశంలో ఉండబోమని తిరుగుబాటు చేస్తున్నారు. బవారియాలో సంస్కృతి సంప్రదాయాల రీత్యా జర్మనీలో ఉండబోమని,.. తమకు ప్రత్యేకదేశం కావాలని ఎన్నో ఏళ్ళుగా ఉద్యమిస్తున్నారు. అయితే కశ్మీర్ విషయంలో జర్మనీ తన వైఖరిని ఇలాగే కొనసాగిస్తే బవారియా విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.