కెనడాపై భారత్ కన్నెర్ర..!

0
155

ఖలిస్థాన్ ఉగ్రవాదులకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతుగా నిలుస్తూ ఉన్నారా..? అనే అనుమానాలు ఇన్ని రోజులు ఉండేవి. తాజాగా అవి నిజమేనని స్పష్టంగా తెలుస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా జస్టిన్ ట్రూడో ఖలిస్థానీ ఉగ్రవాదులకు మద్దతు తెలుపుతూ ఉన్నట్లు ఆయన ప్రకటనలు వింటూ ఉంటే స్పష్టంగా అర్థం అవుతూ ఉంది.

కెనడాలో ఇటీవల జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది, టైగర్​ ఫోర్స్​ చీఫ్​ హర్దీప్​ సింగ్​ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది భారతీయ ఏజెంట్లకు ఈ హత్యతో సంబంధమున్నట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారముందని సంచలన ప్రకటన చేశారు. జూన్‌ నెలలో సర్రేలోని గురుద్వారా వద్ద ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని చంపేసినట్లు వార్తలు వచ్చాయి. జలంధర్‌లో హిందూ పూజారిని చంపిన కేసులో ఖలిస్థానీ టైగర్‌ ఫోర్స్‌కు చెందిన నిజ్జార్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ప్రకటించింది. అతడిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. అయితే నిజ్జార్ హత్య చేసింది భారత్ కు చెందిన దళాలే అంటూ ఖలిస్థానీ మద్దతుదారులు పలు ప్రాంతాల్లో నిరసనలు తెలియజేశారు. ఇలాంటి తరుణంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ మీద నిందలు మోపాడు.

ఖలిస్థానీ ఉగ్రవాది, టైగర్​ ఫోర్స్​ చీఫ్​ హర్దీప్​ సింగ్​ నిజ్జార్ హత్య కేసులో ప్రమేయం ఉందన్న కారణంతో కెనడా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను బహిష్కరించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. అయితే ఆ అధికారి పేరుని మాత్రం వెల్లడించలేదు. కెనడా ప్రభుత్వం నిర్వహించిన అత్యవసర పార్లమెంట్ సెషన్‌లో భారత ఇంటెలిజెన్స్ అధికారికి సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ ఏడాది జూన్‌లో బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో ఖలిస్తానీ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో సదరు రా ఆఫీసర్‌కు సంబంధాలు ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం సరైన సహకారం అందించడం లేదని కూడా ట్రూడో ఆరోపించారు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 సమావేశాల సమయంలోనే ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామని కెనడా ప్రధాని ట్రూడో తెలిపారు.

కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టానికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కెనడా ప్రధానమంత్రి ప్రకటనను, ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రకటనను కూడా చూశామని.. అయితే ఆ ప్రకటనలను తాము తిరస్కరిస్తున్నామన్నారు. కెనడాలో ఏదైనా హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు అసంబద్ధమైనవి, ప్రేరేపించబడినవని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.