వ్యూహానికి ప్రతివ్యూహం రచించాలి. ప్రత్యర్థి ఉచ్చులనే ఎదురుదాడిలో వినియోగించాలి. ఇదే ప్రస్తుతం మన దేశ భద్రత సలహాదారు అజిత్ దోవల్ అనుసరిస్తున్న యుద్ధనీతి. యూరేసియా దేశాలను కబళించేందుకు చైనా సారథ్యంలో 2001, జూన్ 15న ఏర్పాటైన ‘‘షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఎనమిది దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి.
భారత్ తొలుత అబ్జర్వర్ దేశం. 2017 తర్వాత సభ్య దేశమైంది. ఇదే ఏడాది పాకిస్థాన్ కూడా ఈ కూటమిలో చేరింది. దీర్ఘకాల ప్రణాళికలో భాగంగానే ఎస్సీవో కూటమిలో యూరేసియా దేశాలతో పాటు పాకిస్థాన్, భారత్, రష్యాలను చేర్చుకుంది. తానూ కీలక భాగస్వామిగా ఉంది.
గుప్కార్ కూటమి ఢిల్లీలో మోదీ మార్గాన్ని ఆమోదించడం, కతార్ లో తాలిబన్ నేతలతో భారత దౌత్య అధికారుల రహస్య చర్చలు, పాకిస్థాన్ లో హఫీజ్ సయీద్ ఇంటిముందు భారీ పేలుడు, తజకిస్థాన్ లోని దుషన్బే లో ఎస్సీవో వేదికపై భద్రతా సలహాదారు దోవల్, పాకిస్థాన్ ఎన్ఎస్ఏ మోయిద్ యూసఫ్ ల భేటీ…సుమారు ఒకే సమయంలో జరిగిన అత్యంత కీలక పరిణామాలు ఇవి.
మధ్య ఆసియాపై పట్టు పెంచుకునేందుకు చైనా అనుసరిస్తున్న‘‘The empty fort strategy’’లో భాగంగా కజకిస్థాన్, కిర్గిస్థాన్, తుర్క్ మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్ దేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక రచించింది. ఇప్పటికే భారీ ప్రాజెక్టులను నిర్మించింది.
యూరేసియాలో అంతర్, బహిర్ ఉగ్రవాదాన్ని నియంత్రించడంతో పాటు, వాణిజ్య వారధి నిర్మించాలని చైనా బయటకు చెపుతోంది. అయితే చైనా అంతర్గత వ్యూహం వేరు. భారత్ దీన్ని గమనించి, అందుకు తగిన వ్యూహాలను రచిస్తోంది. Counter balance చర్యల్లో భాగంగా రష్యాలోని ఫార్ ఈస్ట్ లో భారీ పెట్టుబడులు పెట్టింది. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో దోవల్ చైనా వ్యూహానికి ప్రతివ్యూహ ప్రతిపాదన చేసి చైనాను రక్షణాత్మక స్థితికి నెట్టారు.
పాకిస్థాన్ సహా చైనా పెట్టుబడులు పెట్టిన దేశాల్లో పేట్రేగుతున్న ఉగ్రవాదం గురించి నోరుమెదపని చైనా, యూరేసియా విషయంలో మాత్రం శాంతి మంత్రం జపిస్తోంది. దీన్ని సమయోచితంగా ఎదుర్కొనేందుకు దోవల్ పాక్ ఉగ్రసంస్థలపై దాడి ప్రతిపాదన చేశారు.
కశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి అంతర్జాతీయ వేదికలపై మౌనం ప్రదర్శించే చైనా యూరేసియాకు ఉన్న ఉగ్ర ప్రమాదం గురించి ఎందుకు బెంగ పడుతోంది? యూరేసియా వనరులపై చైనా ప్రణాళికలు ఏంటి? మధ్య ఆసియాలో చైనా తిష్ఠవేస్తే భారత్ సహా దక్షిణాసియా దేశాలకు వచ్చే ముప్పేంటి? బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ కు-షాంఘై కో-ఆపరేషన్ కు సంబంధం ఏంటి ? చైనా ఇటీవల ప్రకటించిన 4 లక్ష్యాలేంటి? పాక్ ఉగ్రసంస్థల అణచివేత అంశాన్ని ఎస్సీవో మీట్ లో ఉద్దేశపూర్వకంగా అజిత్ దోవల్ ప్రస్తావించారా?
ఇలాంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. తజికిస్తాన్ రాజధాని డషంబేలో ఎనిమిది దేశాల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ -ఎస్‌సీఓ సదస్సులో భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సరికొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ప్రపంచ దేశాల భద్రతకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు అవసరమైన వ్యూహరచన చేసేందుకు ఎనిమిది షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్-SCO సభ్య దేశాలు తజకిస్థాన్ లో రెండు రోజులపాటు భేటీ అయ్యాయి. భారత్ తరపున ఈ సమావేశానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ హాజరయ్యారు.
ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందకుండా దీటుగా ఎదుర్కోవాలన్నారు. అందుకోసం యాంటీ టెర్రర్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ -ఎఫ్‌ఏటీఎఫ్ కు ఎస్ సీఓ కు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరాలని సూచించారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలన్న దోవల్.. ఉగ్రవాద దాడుల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌లో తరచూ దాడులకు పాల్పడే లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌లను కట్టడి చేయడానికి దోవల్ ఒక కార్యాచరణను ప్రతిపాదించారు.
ఉగ్రవాద సంస్థలు చేసే ఆయుధ అక్రమ రవాణా, డార్క్ వెబ్, ఆర్టిపీషియల్ ఇంటలీజెన్స్, బ్లాక్ చెయిన్, సోషల్ మీడియాల వినియోగాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అన్నారు. టెర్రరిజాన్ని అరికట్టడానికి ఐరాస తీర్మానాలన్నింటినీ అమలు చేయాలని, UN గుర్తించిన ఉగ్రవాదులపై కఠిన ఆంక్షలు విధించాలన్నారు అజిత్ దోవల్.
1990 సోవియట్ రష్యా పతనం తర్వాత యూరేసియా దేశాలు అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. 1992-97 వరకు తజకిస్థాన్ లో అంతర్యుద్ధం చెలరేగింది. ఆఫ్ఘనిస్థాన్ మీదుగా మత్తు పదార్థాల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దీనికి తోడు ఇస్లామిక్ ఉగ్రవాదం క్రమంగా బలపడుతోంది. దీంతో చైనా తన వాణిజ్య సామ్రాజ్యానికి వచ్చే ప్రమాదాన్ని గుర్తించింది. ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లో పెట్టుబడులు పెట్టింది. క్రమంగా సిల్క్ రోడ్డులోని దేశాలపై దృష్టి సారించింది. వాణిజ్యం-దౌత్యం-భౌగోళిక విస్తరణ అనే మూడు లక్ష్యాలను సాధించేందుకు ‘షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసింది.
దీన్ని పసిగట్టిన భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ముందు ఎస్సీవో సభ్య దేశం పాకిస్థాన్ లో ఉగ్రవాద సంస్థల పీచమణచిన తర్వాత యూరేసియాలో ట్రాన్స్ నేషనల్ టెర్రరిజంపై దృష్టి సారించడం అవసరమంటూ ప్రతి సవాలు విసిరి చైనా, పాకిస్థాన్ లను డిఫెన్స్ లో పడేశారు.
సిల్క్ రోడ్ పై చైనా ప్రణాళికలేంటి?
బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ భౌగోళికంగా ఆరు రహదారులను, సముద్ర మార్గాలను కలుపుతుంది. ఈ ఆరు మార్గాలు పశ్చిమ చైనాను పశ్చిమ రష్యాతో; ఉత్తర చైనాను మంగోలియా మీదుగా తూర్పు రష్యాతో; పశ్చిమ చైనా ను మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా మీదుగా టర్కీని; నైరుతి చైనాను పాకిస్తాన్ తో, పాకిస్తాన్ ద్వారా; దక్షిణ చైనాను బంగ్లా దేశ్, మైన్మార్ మీదుగా భారత్ ను కలుపుతుంది.
“సముద్ర మార్గ సిల్క్ రోడ్” చైనా కోస్తా తీరాన్ని సింగపూర్-మలేసియ, హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం సహా హోర్ముజ్ జల సంధితో సమన్వయం చేస్తుంది.
2003 నాటి ఇరాక్ యుద్ధం, ఆ తర్వాత జరిగిన పరిణమాలను పరిశీలిస్తే యురేసియా రాజకీయ చిత్రపటాన్ని మార్చాలని చైనా తాపత్రయపడుతోంది. ముఖ్యంగా దక్షిణ-మధ్య యురేసియాను మార్చాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. అంటే ఇందులో పర్షియన్ సింధు శాఖ, కాస్పియన్ సముద్రం, దాని చుట్టూ ఉన్న మధ్య ఆసియా దేశాలు ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియట్ యూనియన్ పరాజయం పాలైన తర్వాత దక్షిణ-మధ్య యురేసియా ప్రాంతంలో అమెరికా ఏర్పాటు చేసిన సైనిక స్థావరాలకు పోటీగా తానూ రంగంలోకి దిగాలని చైనా భావిస్తోంది.
సిల్క్ రోడ్ లేదా సిల్క్ రూట్ కు క్రీ.పూ. 150 నుంచి క్రీ.శ. 1400 దాకా ఉన్న ప్రాశస్త్యం సామాన్యమైంది కాదు. సిల్క్ రోడ్ ఆసియా ఖండాన్ని తూర్పు నుంచి పశ్చిమం దాకా, జపాన్ నుంచి కొరియా ద్వీపకల్పం మీదుగా మధ్యదరా సముద్రాన్ని కలుపుతుంది. చైనా చేపట్టిన సి బి.ఆర్.ఐ. “ఈ శతాబ్దపు గొప్ప పథకం” అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది చైనా. బీఆర్ఐ వంకతో యూరేసియాలో చైనా ప్రాబల్యం పెరిగితే అది భౌగోళిక రాజకీయ, ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తుందనడంలో సందేహం లేదు.
చైనా ప్రకటించిన లక్ష్యాలు..
ఈ ఏడాది ఆరంభంలో చైనా నాలుగు ప్రధాన లక్ష్యాలను ప్రకటించుకుంది. మొదటిది 2049 నాటికి ఆధునిక సోషలిస్టు దేశంగా మారడం, ప్రపంచాధిపత్య శక్తిగా ఆవిర్భవించడం. ప్రపంచంలో ప్రతిచోటా మేడ్ ఇన్ చైనా ముద్రను స్పష్టంగా కనిపించేలా చేయడం, ప్రపంచ మార్కెట్లను నియంత్రించడం ద్వారా ఈ లక్ష్యాలు సాధించాలని చైనా నిర్దేశించింది.
రెండవది, ఈ లక్ష్యాల సాధనకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ముడి సరుకులు, ఇంధన వనరులు, మార్కెట్లు, మౌలిక సౌకర్యాల కల్పన, పెట్టుబడులు, భద్రతా సహకారం వంటివి సమకూర్చుకోవడం చైనాకు చాలా ముఖ్యం. దీంట్లో భాగంగానే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ -బీఆర్‌ఐని చైనా ప్రారంభించింది.
చైనా హిందూ మహాసముద్రంపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, మలక్కా డైలెమాను పరిష్కరించుకోవాలంటే ఈ కారిడార్లు చైనాకు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనవి. ప్రస్తుతం చైనా మొత్తం సముద్ర ఇంధన దిగుమతులలో 80 శాతం మలక్కా జలసంధి ద్వారా జరుగుతోంది. భారత్, అమెరికా ఆధిపత్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నందున ఇది వ్యూహాత్మకంగా చైనాకు బలహీన అంశంగా ఉంటోంది.
భారత్, అమెరికాలు జపాన్, ఆస్ట్రేలియా వంటి ఇతర ప్రాంతీయ శక్తులతో చతుర్ముఖ చర్చలను సాగిస్తూ చైనాకు పోటీనిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా, ఇరాన్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సభ్య దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చైనా విదేశీ విధానం కేంద్రీకరించింది.
చైనా మూడవ లక్ష్యం, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ అంచనా ప్రకారం ఆసియాలో మౌలిక వసతుల కల్పన విషయంలో ఉన్న కొరతలకుగాను 26 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు కావల్సి ఉంది. ఈ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన ఆర్థిక సహాయాన్ని అందించే విషయంలో అమెరికా సహా దాని మిత్ర దేశాలు కానీ ఎలాంటి వ్యూహాత్మక చొరవను తీసుకోవడం లేదు.
అదేసమయంలో చైనా 8 ట్రిలి యన్ డాలర్ల అంచనాతో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ను మొదలు పెట్టినా కరోనా విజృంభణ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఆ ప్రభావం బీఆర్ఐపై పడి, ప్రస్తుతం నత్తనడకన సాగుతోంది.
ఈ ప్రాజెక్టులలో 89 శాతం కంటే అధికంగా చైనా కంపెనీలకే కట్టబెట్టారు. అంటే చైనా పెట్టిన పెట్టుబడులలో చాలావరకు చైనాకే తరలి వచ్చేస్తాయి. వాస్తవార్థంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం ద్వారా యావత్ ప్రపంచంపై చైనా ఆధిపత్యం విస్తృతమవుతోంది.
నాలుగవ లక్ష్యం, ఆసియా, ఆఫ్రికా, యూరేసియాలో చైనా ఉనికి విస్తరిస్తున్నందున, చైనా ఇక ఏమాత్రమూ అమెరికాకంటే తక్కువ స్థానంలో కాకుండా తనపట్ల సమాన సంబంధాలతో వ్యవహరించాలని కోరుకుంటోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ 2013 విదేశీ వ్యవహారాల సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన ప్రసంగం దీన్నే ప్రతిబింబించింది.
‘విజయం కోసం తపనపడుతున్నాం’ అంటూ జిన్ పింగ్ చేసిన ప్రకటన నిమ్న స్థాయి నుంచి డైనమిక్, దూకుడు లక్ష్యాలవైపుగా చైనా విదేశీ విధానం పరివర్తనను ప్రతిబింబించింది. చైనా వ్యూహాత్మక కీలక స్థానాల్లో అత్యాధునిక సైనిక సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ వస్తోంది. దీనివల్లే దక్షిణ చైనా సముద్ర ప్రాంతం, తైవాన్, హాంకాంగ్, ఆప్రికా, లడఖ్‌లలో చైనా సైన్యం దూకుడును ప్రదర్శిస్తోంది.
ప్రపంచ దేశాల్లో జరిగే అన్ని సమావేశాల వేదికపై పాకిస్థాన్, చైనాల ద్వంద్వ ప్రమాణాలను భారత్ వేలెత్తి చూపిస్తోంది. దౌత్యపరమైన ఒత్తిడి తీవ్రం చేసింది. అవకాశం దొరికినప్పుడల్లా పాక్ – చైనా కుట్రలను బట్టబయలు చేస్తోంది భారత్. ఎస్సీవో మీట్ లో దోవల్ ప్రసంగంలోని అంతరార్థం- పాకిస్థాన్ ఉగ్ర సంస్థల అణచివేత ప్రస్తావన పరోక్షంగా చైనాకు చెంపపెట్టు.