More

    భారత్ సహాయం కోరనున్న ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం

    దశాబ్దాల పోరాటం నుంచి అమెరికా సేనలు తప్పుకోవడంతో ఆప్ఘనిస్థాన్ లో మరోసారి అస్థిరత రాజ్యమేలుతోంది. దేశంలోని చాలా వరకు భూభాగంపై తాము పట్టు సాధించామని తాలిబాన్లు ఇప్పటికే ప్రకటించుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితి చక్కదిద్ధేందుకు భారత్ సహాయం తీసుకోవాలని భావిస్తూ ఉంది. తాలిబాన్లతో చర్చలు విఫలమైతే భారత్ నుంచి సైనిక సాయం కోరాలని భావిస్తున్నట్టు భారత్ లో ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ ముముంద్జాయ్ వెల్లడించారు. ఆఫ్ఘన్ కు సైనిక దళాలను పంపాలని తాము కోరడం లేదని, తమ సైనిక దళాలకు శిక్షణ, సాంకేతిక మద్దతు ఇవ్వాలని కోరతామని ఆయన తెలిపారు. ఆగస్టు చివరి నాటికి ఆఫ్ఘన్ నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమించేందుకు అమెరికా ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా.. తాలిబాన్ ప్రతినిధులకు, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మధ్య కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. దోహాలో జరుగుతున్న ఈ చర్చలు విఫలం అయ్యాయనే అంటున్నారు. తాలిబాన్లు పరిపూర్ణ సైనిక విజయంగా ప్రకటించుకోబోతున్నారని ఇప్పటికే పలు మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి.

    ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తుపై ప్రభుత్వం మరియు అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన దళాలను ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉపసంహరించుకుంటూనే ఉంది. తాలిబాన్లు తిరిగి ఆఫ్ఘనిస్తాన్ లో రాజ్యమేలుతుండడంతో శాశ్వత మిత్రదేశం అయిన భారత్ రక్షిస్తుందని ఆఫ్ఘన్ ప్రభుత్వం భావిస్తోంది. తాలిబాన్ల దూకుడును అడ్డుకోవడం కోసం భారతదేశ సైనిక సహాయం కోసం ఆశిస్తోంది.

    ఆఫ్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ ముముంద్జాయ్ మాట్లాడుతూ, తాలిబాన్‌లతో శాంతి ప్రక్రియలో విజయం సాధించలేకపోతే భారతదేశ సైనిక సహాయం అవసరమని చెప్పారు. “మేము తాలిబాన్లతో శాంతి ప్రక్రియలో ఒక దశకు రాకపోతే అప్పుడు మనం భారతదేశ సైనిక సహాయం, రాబోయే సంవత్సరాల్లో ఎక్కువ సైనిక సహాయం కోరుకునే సమయం (రావచ్చు)” అని ఫరీద్ ముముంద్జాయ్ అన్నారు. మేము ఆఫ్ఘనిస్థాన్ కు దళాలను పంపడంలో భారతదేశం యొక్క సహాయం కోరడం లేదని తేల్చి చెప్పారు. సైనిక శిక్షణ, పైలట్ శిక్షణ వంటి విషయాలలో భారత్ సహాయం కోరుకుంటున్నామని రాయబారి తెలిపారు.

    ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా సహా నాటో దళాలు పూర్తిగా వైదొలుగుతుండడంతో తాలిబాన్లు చాలా భూభాగాలను ఆక్రమిస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో 85 శాతం భూభాగం ఇప్పుడు తమ అధీనంలోనే ఉందని తాలిబాన్లు కొద్ది రోజుల కిందట ఓ ప్రకటన చేశారు. ఇరాన్ తో కీలక సరిహద్దు ప్రాంతంపైనా పట్టు సాధించామని.. సరిహద్దు పట్టణం ఇస్లాం ఖలాను చేజిక్కించుకున్నామని తాలిబాన్లు తమ ప్రకటనలో తెలిపారు. 20 ఏళ్ల కిందట ఆఫ్ఘనిస్థాన్ లో ప్రారంభమైన తమ సైనిక కార్యాచరణ ఆగస్టు 31తో పూర్తిగా ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. తాము ఆశించిన లక్ష్యాలను చేరుకున్నట్టు భావిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి ఉగ్ర దాడులు జరిగి 20 ఏళ్లు పూర్తికానుండడంతో గత మే ఒకటో తేదీ నుంచి బలగాల ఉపసంహరణ మొదలుపెట్టారు. సెప్టెంబరు 11 నాటికి తమ దేశ సైనికులను స్వదేశానికి వచ్చేయాలని తెలిపారు. అమెరికా, నాటో బలగాలపై దాడులు చేయకూడదని తాలిబాన్లతో గత ఏడాది ఫిబ్రవరిలోనే నాటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. నాటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ మిలిటరీ, పోలీసు బలగాలపై మాత్రమే తాలిబాన్లు దాడులు చేస్తున్నారు.

    Trending Stories

    Related Stories