టెస్ట్ సిరీస్ దక్షిణాఫ్రికాదే.. స్టంప్ మైక్ దగ్గరకు వెళ్లి సంచలన వ్యాఖ్యలు చేసిన కోహ్లి..!

0
775

దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్ట్ సిరీస్‌ విజయాన్ని సాధిద్దామనుకున్న భారత జట్టుకు మరోసారి నిరాశ ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. పీటర్సన్ స్లిప్స్ లో ఇచ్చిన క్యాచ్ ను పుజారా జారవిడవడం దక్షిణాఫ్రికా లక్ష్యానికి మరింత దగ్గరైంది. కీగన్‌ పీటర్సన్‌(82), డస్సెన్‌(41 నాటౌట్‌), బవుమా(32 నాటౌట్‌) జట్టుకు విజయాన్ని అందించారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్‌ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసింది. తొలి టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. వరుసగా రెండు టెస్టుల్లో నెగ్గి సిరీస్ ను గెలుచుకుంది. కీగన్ పీటర్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

మూడో రోజు సంచలన వ్యాఖ్యలు చేసిన కోహ్లీ:

ఈ టెస్ట్‌ మ్యాచ్ మూడో రోజు ఆటలో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా డీన్‌ ఎల్గర్‌ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌పై థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం వివాదాస్పదమైంది. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చినప్పటికీ.. బాల్‌ ట్రాకింగ్‌లో బంతి వికెట్లపై నుంచి వెళ్తుందనే కారణంగా థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా తేల్చాడు. ఆ నిర్ణయంపై ఫీల్డ్ అంపైర్‌ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కోహ్లి.. స్టంప్స్‌ మైక్‌ దగ్గరకు వెళ్లి ”కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు, మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్ పెట్టండి” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. థర్డ్ అంపైర్‌ను ఉద్దేశించి కోహ్లి చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీ ప్రవర్తన నియమావళి 2.8 ప్రకారం కోహ్లిపై ఓ మ్యాచ్‌లో నిషేధం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.