హెడింగ్లే టెస్టు మ్యాచ్ ను భారత బ్యాట్స్మెన్ కాపాడుకోలేకపోయారు. ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఓటమి పాలైంది. మూడో టెస్టులో ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడింది. నాలుగో రోజు మొదటి సెషన్ లో ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్ భారత్ ను దెబ్బ తీశాడు. 5 వికెట్లు తీసుకున్న రాబిన్సన్ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. క్రెగ్ ఒవెర్టన్ కు 3 వికెట్లు, ఆండర్సన్ కు 1, మొయిన్ అలీకి 1 వికెట్ దక్కాయి. నాలుగో రోజు ఉదయం 215/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. కేవలం 63 పరుగుల తేడాతో మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది. పుజారా 91 పరుగుల వద్ద అవుట్ అవ్వగా.. కోహ్లీ హాఫ్ సెంచరీ తర్వాత పెవిలియన్ చేరాడు. రహానే, పంత్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. జడేజా (30) ధాటిగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. టెయిలెండర్లు వరుసగా అవుట్ అవ్వడంతో రెండో ఇన్నింగ్స్ ను టీమిండియా 278 పరుగుల వద్ద ముగించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే కుప్పకూలగా, ఇంగ్లండ్ 432 పరుగుల భారీ స్కోరు సాధించింది. 354 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ సెంచరీ సాధించాడు. బౌలర్లు ఆండర్సన్, రాబిన్సన్, ఒవెర్టన్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించారు. ఇంగ్లండ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో 1-1తో సిరీస్ సమంగా ఉంది.