More

  ఒక్క గ్రామం కోసం.. పాక్‎కు 12 గ్రామాల్ని వదిలేసిన భారత్..!

  పూర్వకాలంలో రాజ్యాల కోసం యుద్ధాలు జరిగేవి. యుద్ధంలో గెలిచిన రాజులు.. ఓడిపోయిన రాజుకు చెందిన రాజ్యాన్ని ఆక్రమించుకునేవారు. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకోసం కూడా యుద్ధాలు జరిగేవి. గెలుపోటముల ఆధారంగా ప్రాంతాల పంపకాలు జరిగేవి. ఇంకొన్నిసార్లు విదేశీయుల ఆక్రమణ నుంచి స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యోద్యమాలు జరిగేవి. ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర్యం కోసం జరిగి యుద్ధాలు కోకొల్లలు. కానీ, భారత స్వాతంత్ర్యోద్యమాన్ని మించిన ఉద్యమం లేదంటే అతిశయోక్తి కాదు. సుదీర్ఘ పోరాటం తర్వాత, ఎందరో త్యాగధనుల ప్రాణత్యాగంతో బ్రిటీష్ కంబంధ హస్తాల నుంచి భారతావనికి విముక్తి కలిగింది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది.

  కానీ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారత్ కొంత భూభాగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కొందరి స్వార్థం వల్ల దేశవిభజన జరిగి.. భారత్ నుంచి కొంత భూభాగాన్ని చీల్చుకుని.. మత ప్రాతిపదికన పాకిస్తాన్ అనే దేశం ఏర్పాటైంది. సరే, జరిగిందేదో జరిగిపోయిందనుకుంటే.. నాటి పాలకుల అసమర్థత కారణంగా కశ్మీర్ అపరిష్కృతంగా మిగిలింది. అక్కడ దశాబ్దాలుగా పాకిస్తాన్ వేర్పాటువాద చిచ్చును రగిలిస్తూనేవుంది. అఖండ భారత్ ను ముక్కలు చేసింది కాక.. ఆక్రమిత కశ్మీర్ కోసం గోతికాడి నక్కలా వేచిచూస్తోంది.

  స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయినా.. కశ్మీర్ రావణకాష్టంలా రగులుతూనేవుంది. కశ్మీర్ వివాదం కారణంగా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే, కశ్మీర్‎లో ఒక్క అంగుళం భూమిని వదులుకోవడానికి సిద్ధంగా లేని భారత్.. దేశ విభజన సమయంలోనే పాకిస్తాన్‎తో కాంప్రమైజ్ అయి.. ఏకంగా 12 గ్రామాల్ని వదులుకుందంటే నమ్ముతారా..? ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాలా నిజం..! కేవలం ఒక్క గ్రామం కోసం 12 గ్రామాల్ని పాకిస్తాన్ కు వదిలేసుకుంది భారత్. అయితే, నాడు భారత ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయం వెనుక చాలా పెద్ద కారణమే ఉంది.

  భారత్ – పాకిస్తాన్ బోర్డర్‎లో ఆ గ్రామం పేరు హుస్సేనివాలా. ఇది ప్రస్తుతం పంజాబ్‌ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామానికి పెద్ద చరిత్రే వుంది. నూనూగుమీసాల వయసులోనే బ్రిటీష్ వాడిని గడగడలాడించిన భారత సింహాలు.. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‎లు శాశ్వత నిద్రలో వున్న గ్రామమది. భగత్ సింగ్ సహచరుడు బతుకేశ్వర్ దత్ సమాధి కూడా ఇదే గ్రామంలో వుంది ఉంది. భరతమాత వీరపుత్రుడికి జన్మనిచ్చిన.. భగత్ సింగ్ మాతృమూర్తి, పంజాబ్ మాతా బిరుదాంకితురాలైన విద్యావతి దేవి సమాధి కూడా హుస్సేనివాలా గ్రామంలోనే వుంది.

  భారత్‎లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకిస్తూ భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు నాటి బ్రిటీష్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. ఆ ఘటనలో ఆ ముగ్గురిని అరెస్ట్ చేసిన బ్రిటన్ ప్రభుత్వం.. వారికి ఉరి శిక్ష విధించింది. అయితే నిర్ణీత రోజున వారిని ఉరి తీస్తే.. జనాగ్రహాన్ని తట్టుకోవడం కష్టం అని భావించిన బ్రిటీష్ పాలకులు.. లాహోల్‌ జైలులో ఉన్న ముగ్గురు వీరులను.. గుట్టు చప్పుడు కాకుండా ఉరితీశారు. 1931 మార్చి 23న ఉరి శిక్షను అమలు చేశారు. అదే రోజున అర్థరాత్రి జైలు గోడలను బద్దులు కొట్టి.. దొడ్డిదారిలో ఆ ముగ్గురు వీరుల మృతదేహాలను లాహోర్ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేనివాలా గ్రామంలో ఖననం చేశారు బ్రిటీష్ అధికారులు.

  అంతేకాదు, ముగ్గురు అమరవీరుల మృతదేహాలకు ఎలాంటి సంప్రదాయాలను పాటించకుండా.. అదీ అర్థరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. వారి అవశేషాలను పక్కనే ప్రవహిస్తున్న సట్లేజ్ నదిలో పడేశారు. ఆ తర్వాతికాలంలో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు సమాధులను హుస్సేనివాలాలో స్థాపించారు. అయితే, దేశ విభజన సమయంలో ఈ గ్రామం పాకిస్తాన్ లోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని.. నాటి భారత ప్రభుత్వం.. ఆ గ్రామాన్ని భారత్ కు ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే, తమ వాటాగా వచ్చిన గ్రామాన్ని వదులుకోవడానికి పాకిస్తాన్ మొండికేయడంతో.. భారత్ అందుకు ప్రతిఫలంగా 12 గ్రామాల్ని వదులుకోవాల్సి వచ్చింది. సరిహద్దుల్లోని సులేమాన్ ప్రాంతంలో ఉన్న 12 గ్రామాలను పాకిస్తాన్‌ అప్పగించి., హుస్సేనివాలా గ్రామాన్ని భారత్ తన ఆధీనంలోకి తీసుకుంది. అలా హుస్సేనివాల భారత భూభాగంలోకి చేరింది.

  హస్సేనివాలా గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల గుర్తులు ఉండటం, భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఈ గ్రామానికి ప్రత్యేక స్థానం ఉండటంతో భారత ప్రభుత్వం అలాంటి కఠిన నిర్ణయం తీసుకోకతప్పలేదు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ప్రాణత్యాగానికి గుర్తుగా.. ప్రతియేటా మార్చి 23న దేశవ్యాప్తంగా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే రోజున ఈ హుస్సేనివాలా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భారీగా జనం తరలివస్తారు. దేశం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన ఆ త్రిమూర్తులకు అంజలి ఘటిస్తారు. అమరవీరులను శాశ్వతంగా తనలో కలుపుకున్న హస్సేనివాలా గ్రామానికి ఎంత అదృష్టమో కదా..!

  Trending Stories

  Related Stories