అమెరికా పౌరసత్వంలో భారతీయుల స్థానం ఎంతంటే..!

0
993

ఆర్థిక, సైనిక రంగాల్లో చైనా ఎంతగా ఎదుగుతున్నప్పటికీ వలసదారులకు పెద్దన్నలా ఉండటమే అమెరికాను అగ్రరాజ్యంగా నెలబెడుతోందనడం అతిశయోక్తికాదేమో. ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకు వలసలు ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే సాగుతున్నాయి.

అమెరికాలో పుట్టినవారికి, నిర్దిష్ట కాలంపాటు అక్కడ పనిచేసి, ఇకపైనా ఉండాలనుకునే వారికి పౌరసత్వాలు జారీ చేయడం చాలా కాలంగా వస్తున్నదే. అయితే, అమెరికా పౌరసత్వం పొందుతోన్న వారిలో భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అమెరికాలో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కొత్తగా పౌరసత్వం పొందినవారు ఎక్కువగా ఉన్న తొలి 5 దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం గణాంకాల ప్రకారం.. ఈ త్రైమాసికంలో మొత్తం 1,97,148 మందికి పౌరసత్వం ఇవ్వగా ఈ 5 దేశాలకు చెందినవారే 34% ఉన్నారు.

అమెరికా పౌరసత్వం పొందినవారిలో అత్యధికంగా మెక్సికో నుంచి 24,508 మంది ఉండగా.. భారత్‌కు చెందిన వారు 12,928 మంది ఉన్నారు. ఫిలిప్పీన్స్‌ (11,316), క్యూబా (10,689), డొమినికన్‌ రిపబ్లిక్‌ (7,046)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2021లోనూ తొలి త్రైమాసికంలో మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాల్లో మెక్సికో, భారత్‌లు ముందంజలో ఉండగా క్యూబా, ఫిలిప్పీన్స్‌, చైనాలు తర్వాతి వరుసలో నిలిచాయి.

అమెరికాలో అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఈమేరకు 2022 ఆర్థిక సంవత్సరంలో జూన్‌ 15 నాటికి మొత్తం 6,61,500 మంది కొత్తగా పౌరసత్వం పొందినట్లు అమెరికా పౌరసత్వ, వలసల సేవా విభాగం తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,55,000 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. అమెరికా జులై 4న స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకొంటున్న నేపథ్యంలో ఈనెల 1 నుంచి 8వ తేదీ మధ్య కొత్తగా 6,600 మందికి పైగా పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 + 7 =