More

  మా భాగస్వామి చైనా కాదు.. భారత్..!
  బీజింగ్ కు పోర్చుగల్ షాక్..!!

  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనసు మంచిదైతే ఊరంతా బంధువులే. పెద్దలు చెప్పిన ఈ సామెతలు అక్షరాలా నిజం. కానీ, జిత్తులమారి చైనా.. ఈ సామెతలకు పూర్తివ్యతిరేకం. విస్తరణకాంక్ష, ఆధిపత్య వైఖరి, కుట్రలు, కుతంత్రాల వల్ల ప్రపంచమంతా డ్రాగన్‎కు దూరమవుతోంది. కరోనా పాపాన్ని మూటగట్టుకున్న చైనాతో.. ఒక్కో దేశం సంబంధాలను తెగదెంపులు చేసుకుంటోంది. ఇటీవల జీ7 కూటమి ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే, దక్షిణ కొరియా దిమ్మదిరిగేలా షాక్ ఇచ్చింది. ఆ దేశానికి ప్రపంచ ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజం శాంసంగ్.. చైనా నుంచి భారత్‎కు తరలివస్తున్నట్టు ప్రకటించింది. చైనాలోని తమ తయారీ విభాగాన్ని యూపీలోని నోయిడాకు తరలిస్తున్నట్టు చెప్పేసింది. తాజాగా యూరప్ దేశం పోర్చుగల్ కూడా చైనా సంబంధాలపై విముఖ ప్రదర్శిస్తోంది.

  మా భాగస్వామి మీరే.. చైనా కాదు.. అంటూ పోర్చుగల్ ఆర్థికమంత్రి ఆగస్టో శాంటోజ్ సిల్వా భారత్‎కు తేల్చిచెప్పారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‎తో జరిగిన వెబినార్‎లో మాట్లాడిన ఆయన.. ‘చైనా ఈజ్ ఏ సెలెక్టివ్ పార్ట్నర్ అండ్ ఏ సిస్టమిక్ రైవల్’ అంటూ తేల్చేశారు. అంతేకాదు, చైనా విషయంలో యూరోపియన్ యూనియన్ మద్దతు భారత్‎కే ఉంటుందని అన్నారు. రాజకీయ సంస్థలు, సిద్ధాంతాలు, మానవహక్కులు, పౌర సమాజం.. ఇలా దేనిని తీసుకున్నా.. బీజింగ్ వైఖరికి, బ్రసెల్స్ వైఖరికి చాలా తేడా వుందని అన్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు.. ఆసియాలో తమ భాగస్వామి భారత్ మాత్రమేనని.. చైనా కాదని చెప్పారు.

  ఇదిలావుంటే, భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి గణనీయమైన అభివృద్ధి సాధించాయని అన్నారు. భారత్, యూరోపియన్ యూనియన్ బంధంలో గణనీయమైన శక్తిని గమనించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ యూనియన్ నాయకుల మధ్య జరిగిన భేటీ ఎంతో సానుకూలంగా సాగిందని అన్నారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. వాటిలో వాణిజ్య, పెట్టుబడి ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభం కావడం కూడా ఒకటి అన్నారు.

  ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ అధ్యక్ష హోదాలో వున్న పోర్చుగల్.. భారత్‎ను తమ భాగస్వామిగా పేర్కొనడం,.. ఈయూ అనుకూల వైఖరికి అద్దం పడుతోంది. యూరోపియన్ యూనియన్ అందించే ఇలాంటి సహకారం.. భారత్ చైనాను మరింత కట్టడి చేయడానికి దోహదపడుతుంది. ఇటీవలికాలంలో యూరోపియన్ యూనియన్ తో చైనా సంబంధాలు విపరీతంగా క్షీణించాయి. ఇదే సమయంలో ఈయూ భారత్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ వుండటం.. చైనా కమ్యూనిస్టుల గుండెల్లో మంట పుట్టిస్తోంది.

  ఈయూతో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ కోసం.. కేంద్ర వాణిజ్యమంత్రి పియూష్ గోయల్ గత మే నెలలో సంప్రదింపులు జరిపారు. యూరోపియన్ యూనియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ వాల్డిస్ డొంబ్రోస్కీకి లేఖ కూడా రాశారు. భారత్-ఈయూ లీడర్ల సమ్మిట్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని కోరారు. నిజానికి, 2007 లో ప్రారంభమైన భారత్-ఈయూ ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడుల ఒప్పందానికకి 2013 లో బ్రేక్ పడింది. 16 రౌండ్ల చర్చల తర్వాత కూడా పునరుద్ధరణకు నోచుకోలేదు. అయితే, చైనాతో ముప్పును ఎదుర్కునే క్రమంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఈయూ సంబంధాలను పటిష్టం చేసుకుంటోంది. మోదీ చొరవతోనే ఈయూతో వాణిజ్య ఒప్పందంపై పురోగతి సాధ్యమైంది.

  Trending Stories

  Related Stories