Defence Special

అక్సాయ్ చిన్ మనదే..! కేంద్రం భారీ ఏర్పాట్లు..!!

ఓసారి డోక్లాం, మరోసారి గల్వాన్, ఇంకోసారి ప్యాంగాంగ్ సో. భారత సరిహద్దులను దాటేందుకు చైనా ప్రయత్నిస్తూవుంది. తాజాగా డెమ్ చోక్ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడిన పీఎల్ఏ సైన్యం టెంట్లు కూడా వేసింది. దీనిపై భారత్ తీవ్రంగా ప్రతిఘటించడంతో తోకముడిచింది. డోక్లాం, గల్వాన్, ప్యాంగాంగ్ సో ఘటనల్లోనూ భారత్ ఘాటుగా సమాధానం చెప్పింది. ఇలా తరుచూ ఉద్రిక్తతలు సృష్టిస్తూ, కవ్వింపులకు పాల్పడుతూ విస్తరణకాంక్షతో రగిలిపోతోంది డ్రాగన్. అయితే, చైనా సైన్యం సరిహద్దుల్లోకి చొరబడే ప్రయత్నం చేసిన ప్రతీసారి భారత భద్రతా బలగాలు బుద్ధిచెబుతూనేవున్నాయి. కానీ, ఇలా ఎన్నాళ్లు..? డ్రాగన్ కవ్వింపులకు ముగింపు పలకాలంటే ఏంచేయాలి..? దీనికి భారత చైనా సరిహద్దుల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం ఒక్కటే మార్గం. అందుకే, లద్దాక్ ప్రాంతంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సైనిక బలగాల రవాణా, మౌలిక సదుపాయాల పెంపు కోసం విశేషంగా కృషి చేస్తోంది. సరిహద్దుల రక్షణకు పెద్దపీట వేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. అక్కడ ఎయిర్ పోర్టులు, ఎయిర్ ఫీల్డ్స్, హెలీపాడ్లను నిర్మిస్తోంది.

చైనా కవ్వింపులకు చెక్ పెట్టేలా.. లద్దాక్ లో నాలుగు ఎయిర్ పోర్టులు, 37 హెలీపాడ్లు నిర్మిస్తోంది కేంద్రం. దీనికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తిచేసింది. కేంద్రం త్వరలోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగాలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు ఎయిర్ పోర్టుల కోసం.. ల్యాండింగ్ అనువైన ప్రదేశాలను ఎంపిక చేశారు. అంతేకాదు, జన్‎స్కర్ వ్యాలీని అనుసంధానించే విధంగా.. ప్రస్తుత లేహ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అటు, గల్వాన్ ఘర్షణల తర్వాత ఉద్రిక్తంగా మారిన ప్యాంగాంగ్ సో సరస్సు ప్రాంతంపైనా భారత్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా సరస్సు వద్దకు సులభంగా చేరుకునేలా.. చాం‎గ్ టాంగ్ వద్ద ఎయిర్ ఫీల్డ్ నిర్మాణాన్ని చేపట్టింది.

కొన్నాళ్ల క్రితం ప్యాంగాంగ్ సో సరస్సు వద్దకు చైనా తన సైన్యాన్ని తరలించింది. దీంతో ఆ ప్రాంతంలో కొన్ని నెలల పాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. దీనికి కౌంటర్ గా భారత సైన్యం కూడా నిర్ణయాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకుని డ్రాగన్ కు హెచ్చరికలు పంపింది. దీంతో బీజింగ్ వెనక్కి తగ్గక తప్పలేదు. అందుకే, సరస్సుకు దగ్గర్లోని చాంగ్ టాంగ్ వద్ద ఎయిర్ ఫీల్డ్ నిర్మించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం ఎయిర్ ఫీల్డ్స్, ఎయిర్ పోర్ట్స్ మాత్రమే కాదు.. లద్దాక్ వ్యాప్తంగా 37 హెలీపాడ్లను కూడా నిర్మింస్తోంది. చినూక్ CH-47 వంటి అత్యంత భారీ హెలీకాప్టర్లు కూడా సులభంగా ల్యాండయ్యేలా వీటిని నిర్మిస్తున్నారు. ఈ హెలీపాడ్లన్నీ ఈ ఏడాది చివరిలోగా అందుబాటులోకి రానున్నాయి.

లద్దాక్ వ్యాప్తంగా ఎయిర్ పోర్టులు, ఎయిర్ ఫీల్డ్స్, హెలీపాడ్లు నిర్మించడం ద్వారా సరిహద్దుల్లోని నిర్జన ప్రాంతాలకు సైనిక దళాలు తరలించడం మరింత సులభమవుతుంది. సైన్యంతోపాటు, సైనిక సామాగ్రి, ఆయుధాలను కూడా ఈజీగా చేరవేయవచ్చు. అంతేకాదు, కొన్ని ఎయిర్ పోర్టులలో సివిల్ ఏవియేన్‎కు కూడా కేంద్రం అనుమతులు మంజూరు చేయనుంది. దీంతో పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది. మొత్తానికి లద్దాక్‎లో చైనా ముప్పును ఎదుర్కోవడానికి, భారత ప్రభుత్వం ఓవర్‎టైమ్ మోడ్‎లో పనిచేస్తోంది.

అటు చైనాకు చెక్ పెట్టేందుకు ఏ అవకాశాన్ని కూడా భారత్ వదులుకోవడం లేదు. ఇటీవల 50 వేల మంది సైనికులను సరిహద్దులకు తరలించింది భారత్. ప్రస్తుతం ఆ సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. దక్షిణ టిబెట్ పీఠభూమి వెంబడి దళాల సంఖ్య కూడా పెరిగింది. అత్యాధునిక మెషిన్ గన్లతో కూడా సైనిక దళాలు.. అప్పటికే అక్కడ పహారా కాస్తున్న సైనిక దళాలతో చేరిపోయాయి. అయితే, సరిహద్దుల్లో భారత్ వ్యూహాత్మక చర్యల్ని పసిగట్టిన చైనా.. ఇటీవల తాటాకు చప్పుళ్లు చేసింది. డ్రాగన్ మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ భారత్ తన పైత్యాన్ని ప్రదర్శించింది. భారత్ రాజకీయ ఎత్తుగడలు ఆపేసి.. సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటూ హితవు పలికింది. శాంతిని పెంపొందించే సంకల్పం, సైనిక బలగం రెండింటిలోనూ భారత్ కంటే చైనా బలంగా వున్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ తాటాకుచప్పుళ్లు చేసింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత లద్దాక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. అక్కడ ఆర్మీ మౌలిక సదుపాయాలను విస్తృతం చేస్తోంది. ఇదంతా సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు చెక్ పెట్టేందుకేనని చెబుతున్నా.. దీని వెనుక మరో కారణం కూడా వుందంటున్నారు విదేశాంగ నిపుణులు. ఆ ప్రాంతంలో సైనికంగా బలోపేతం కావడం ద్వారా.. దశాబ్దాలుగా చైనా ఆక్రమణలో వున్న ఆక్సాయ్ చిన్ ను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని అంచనావేస్తున్నారు. ఇటీవలికాలంలో కేంద్ర మంత్రుల ప్రకటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. గతేదాడి రాజ్యసభలో ప్రసంగించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాక్ లో 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆక్రమణలోనే కొనసాగుతోందని అన్నారు. 1963 నాటి చైనా పాకిస్తాన్ ఒప్పందంలో భాగంగా.. పీవోకేలోని 5,180 కిలోమీటర్ల భారత భూభాగాన్ని పాకిస్తాన్ చైనాకు కట్టబెట్టిందని గుర్తుచేశారు. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని 90 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తనదిగా చెప్పుకుంటోందని అన్నారు.

అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అక్సాయ్ చిన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అది భారత భూభాగమని.. దాని కోసం జీవితాలను అంకితమివ్వడానికి కూడా తాము సిద్ధమని పార్లమెంట్ సాక్సిగా ప్రకటించారు. తాను ఎప్పుడు జమ్మూ కశ్మీర్ అని సంభోదించినా.. అందులో పీవోకే, అక్సాయ్ చిన్ కూడా భాగమేనని అన్నారు. ఇదీ లద్దాక్, అక్సాయ్ చిన్ విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరి. మొత్తానికి, లద్దాక్ లో ఆర్మీ మౌలిక సదుపాయాల విషయంలో భారత్ దూకుడు పెంచింది. మరి, దీనిపై బీజింగ్ స్పందన ఎలా వుంటుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

4 × 5 =

Back to top button