తూర్పు లడఖ్‌లో చైనా సైన్యం మరోసారి తోకజాడిస్తూ ఉంది. దీంతో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చైనా సైనికులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం చర్యలు చేపట్టింది. లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ పొడుగునా సున్నితమైన ప్రాంతాల్లో భారత్ సుమారు 60 వేల మంది దళాలను మోహరించింది. ఎప్పటికప్పుడు భారత సైన్యం చైనా తీరును ఎండగడుతూ వస్తోంది.
ఇక అరుణాచల్ సెక్టార్‌లోనూ చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గత వారం కొంతమంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఏ)కి చెందిన సైనికులు 200 మంది భారత్ లోకి చొరబడ్డానికి ప్రయత్నించారు. ఖాళీగా ఉన్న బంకర్లను దెబ్బతీసేందుకు ప్రయత్నించడంతో భారత సైనికులు చైనా సైనికులను తాత్కాలికంగా నిర్బంధించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఈ ఘటన జరిగింది. యాంగ్సే మరియు బమ్ లా సరిహద్దు పాస్ మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ (LAC) ను చైనా సైనికులు అతిక్రమించారని మీడియా సంస్థలు తెలిపాయి. భారత సైనికులు చైనా దూకుడును అడ్డుకున్నారు.. వారిలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. “ఈ ఘటన తరువాత స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో సమస్య పరిష్కరించబడింది. చైనా సైనికులను ఆ తర్వాత విడుదల చేశారు” అని ప్రకటన వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న వాస్తవాధీన రేఖపై రెండు దేశాలకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, అయితే రెండు దేశాల సైనికులు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన వచ్చింది.
“రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలు మరియు ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండటం ద్వారా విభిన్న అవగాహన ఉన్న ఈ ప్రాంతాలలో శాంతి మరియు ప్రశాంతత సాధ్యమవుతుంది. రెండు వైపుల పెట్రోలింగ్ భౌతికంగా ఉన్నప్పుడల్లా, రెండు వైపులా అంగీకరించబడిన ప్రోటోకాల్‌లు, యంత్రాంగాల ప్రకారం పరిస్థితి సమీక్షించబడుతుంది. పరస్పర అవగాహన ముఖ్యం” అని ప్రకటనలో తెలిపారు. అరుణాచల్ ఘటనలో భారత రక్షణ దళాలకు ఎటువంటి నష్టం జరగలేదని స్పష్టమైంది. గతంలోనూ అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద పలుమార్లు చైనా దళాలు అక్రమంగా చొరబడే ప్రయత్నం చేశాయి. ఆ ప్రాంతంలో అనేకసార్లు ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది.