బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. భారతీయ నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్టణం యుద్ధ నౌక నుంచి ఆ క్షిపణిని పరీక్షించారు. పశ్చిమ తీరంలో ఈ పరీక్షను చేపట్టారు. సముద్రం నుంచి సముద్రంపై టార్గెట్లను చేధించే వేరియంట్‌ను పరీక్షించారు. లక్ష్యానికి తగ్గట్టుగా ప్రయాణించి.. టార్గెట్ నౌకను పేల్చినట్లు భారతీయ నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని “ఖచ్చితంగా” చేధించిందని తెలిపింది. “సముద్రంలో నుండి లక్ష్యాన్ని ఛేదించగల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఈరోజు INS విశాఖపట్నం నుండి పరీక్షించారు. క్షిపణి నిర్దేశించిన లక్ష్య నౌకను ఖచ్చితంగా ఢీకొంది” అని DRDO ట్వీట్ చేసింది. క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం భారత నావికాదళం పటిష్టతను ప్రపంచానికి తెలియజేసింది రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అద్భుతమైన టీమ్ వర్క్‌ను అభినందిస్తున్నానని రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
బ్రహ్మోస్ ఏరోస్పేస్, భారతదేశం-రష్యన్ జాయింట్ వెంచర్ ద్వారా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఉత్పత్తి చేస్తున్నారు.. దీనిని జలాంతర్గాములు, నౌకలు, విమానాలు లేదా భూమి మీద నుండి ప్రయోగించవచ్చు. పలు వెర్షన్స్ బ్రహ్మోస్ లో ఉన్నాయి. బ్రహ్మోస్ భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO), రష్యన్ NPO మషినోస్ట్రోయెనియాల మధ్య 1998లో ఏర్పాటు చేయబడిన జాయింట్ వెంచర్‌లో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. ‘బ్రహ్మోస్’ పేరు భారతదేశం లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నది నుండి ఉద్భవించింది.
వాషింగ్టన్ DC-ఆధారిత థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రకారం, బ్రహ్మోస్ దాని సూపర్సోనిక్ వేగంతో విశిష్టమైనదని స్పష్టం చేసింది. మాక్ 2.0-2.8 వద్ద ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ క్షిపణిని అడ్డుకోవడం చాలా కష్టం.