More

  టిబెట్‎లో 5జీ, బోర్డర్‎లో బిజీ..!
  చైనా ఆగడాలపై యూఎస్ రిపోర్ట్..!!

  ఆదమరిచి ఉండాలే గానీ, భారత్‎ను అమాంతం మింగేస్తుంది చైనా. మన వీరజవాన్లు, ఇంటలిజెన్స్, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేదంటే, సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూనేవుంటుంది. తన జిత్తులమారి వేషాల్ని ఎప్పటికీ నమ్మొద్దని.. తన బుద్ధే అంతని.. డ్రాగన్ మరోసారి రుజువు చేసుకుంది. అమెరికా ఇంటలిజెన్స్ నివేదికలు చైనా కుట్రల్ని మరోసారి తేటతెల్లం చేశాయి. చైనా, భారత భూభాగాన్ని ఆక్రమిస్తోందంటూ అమెరికా ఇంటలిజెన్స్ రిపోర్టు సంచలన విషయాలు వెల్లడించింది.

  ఓవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న సమయంలోనే.. గతేడాది సరిహద్దులను చెరిపేసి భారత భూభాగంలోకి చొరబడేందుకు చైనా విఫలయత్నం చేసింది. డ్రాగన్ ప్రేరేపించిన గల్వాన్ ఉద్రిక్తతల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ స్పష్టంగా చెప్పింది. చైనా చర్య ఈ దశాబ్దాలలోనే అత్యంత తీవ్రమైనదిగా అభివర్ణించింది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో కొత్తగా కృత్రిమ గ్రామాలను నిర్మించడం వంటి కుట్రలకు తెరతీసిన విషయాన్ని కూడా వెల్లడించింది. దీంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పురాలేదని యూఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది.

  సరిహద్దుల్లో డ్రాగన్ కుట్రల్ని నివేదిక ఏకరువుపెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలోనూ చైనా పలు దుర్మార్గాలకు ఒడిగట్దింది. ఉత్తర సిక్కింలోని నాథులా లోయ సరిహద్దుల్లో భీకరమైన పోరాటం జరిగింది. చైనా సైన్యానికి భారత సైన్యం గట్టిగా బదులివ్వడంతో,. దాదాపు 30 చైనా సైనికులు గాయపడ్డారు. ఇలాంటి విషయాలను నివేదికలో పొందిపరిచారు. ఇదే ఇంటలిజెన్స్ రిపోర్టులో యూఎస్ పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ఇరుదేశాల మధ్య పరస్పరం అనేక మార్లు చర్చలు జరగడంతో, ఇటీవల భారత – చైనా సరిహద్దుల్లోని పలు ప్రాంతాల నుంచి బలగాలను, ఆయుధ సామగ్రిని ఇరుదేశాలు వెనక్కి తీసుకుంటున్నాయని కూడా సదరు నివేదిక పేర్కొంది.

  అయితే, చైనాను అంత ఈజీగా నమ్మరాదన్న విషయం మరోసారి రుజువైంది. తాజాగా మరో కుట్రకు తెరతీసింది. ఆ కుట్రపేరే 5జీ. చైనా కుట్రల్ని భారత్ ఎప్పటికప్పుడు పసిగట్టి.. జవాబు చెబుతుండటంతో.. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టిసారించింది. తాజాగా భారత సరిహద్దుకు సమీపంలో ఆధునిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా మన దేశ సైనిక స్థావరాలను దగ్గరి నుంచి, అత్యంత వేగవంతమైన నెట్ వర్క్ ద్వారా పసి గట్టేందుకు కొత్తగా కుట్రలు ప్రారంభించింది.

  సరొటహద్దులకు అత్యంత సమీపంలోని టిబెట్‌ వద్ద చైనా సరికొత్త 5జీ కమ్యూనికేషన్‌ సిగ్నల్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. గన్‌బాల రాడార్‌ స్టేషన్ లో భాగంగా దీనిని కూడా ప్రారంభించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో అంటే దాదాపు 5,374 మీటర్ల ఎత్తున నిర్వహిస్తున్న రాడార్‌ స్టేషన్‌ ఇదే. ఈ విషయాన్ని చైనా మిలటరీ వెబ్‌సైట్ స్వయంగా వెల్లడించింది. టిబెట్‌ లోని నగార్జే కౌంటీలో ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది డ్రాగన్. ఇది భారత్, భూటాన్ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. గతేడాది పలు సంస్థలతో కలిసి ఇక్కడ 5జీ స్టేషన్‌ను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టింది చైనా. సరిహద్దుల్లోని చైనా సైనిక దళాలకు కమ్యూనికేషన్‌లో సమస్యలను తొలగించేందుకు ఈ రాడార్ స్టేషన్‌ను వాడుకోవాలని చైనీస్ మిలిటరీ ప్లాన్ చేస్తోంది. ఈ సేవలతో దట్టమైన పర్వతాల్లో ఉన్నా సైనికులకు స్పష్టమైన సిగ్నళ్లను చైనా అందించగలుగుతుంది.

  మన దేశంతో వివాదం కొనసాగుతున్న సమయంలో సరిహద్దుల వెంట భారీస్థాయిలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే పనిలో శరవేగంగా చర్యలను చేప్టటింది చైనా. ఉద్రిక్తతలు అధికంగా ఉన్న పాంగాంగ్‌ సరస్సులోని సౌత్ ఏరియా వరకు కేబుళ్లను వేసేందుకు అప్పట్లో భారీ ఎత్తున తవ్వకాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని భారత సైనిక అధికారులు ధ్రువీకరించారు. వేగవంతమైన సమాచారం కోసం చైనా ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ వేయడం ఆందోళన కలిగిస్తోందంటూ.. అప్పట్లో ఓ భారత అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేబుళ్ల ద్వారా సరిహద్దుల్లోని దళాలకు వెనుకనున్న సైనిక స్థావరాల నుంచి సురక్షితమైన సమాచారం అందుతుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు దృశ్యాలను, డాక్యుమెంట్లను పంపించుకోవచ్చు. రేడియోలో మాట్లాడితే దొరికిపోవచ్చు. సంకేతాలను అడ్డుకోవచ్చు. ఆప్టికల్‌ ఫైబర్‌తో అలాంటి పరిస్థితి ఉండదు. సమాచారం సురక్షితంగా ఉంటుందని ఆ అధికారి తెలిపారు.

  భారత సరిహద్దుల్లోని చైనా గగనతల రక్షణ వ్యవస్థలను గతంలో మోహరించింది. వాటిని ఇప్పటికీ కొనసాగిస్తోంది. భారత దళాలు వీటిపై ఓ కన్నేసి పెట్టాయని ఎ ప్రముఖ జాతీయ వార్తాసంస్థ వెల్లడించింది. హెచ్‌క్యూ, హెచ్‌క్యూ 22 వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే హెచ్‌క్యూ9 కూడా ఇక్కడ ఉంచినట్లు వార్తలొచ్చాయి. ఇది ఎస్‌-300 చైనా తయారు చేసిన నకలు. దీని రేంజి 250 కిలోమీటర్లు. వీటిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచినట్లు మన సైనిక వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు హోటాంగ్‌, కష్గర్‌లోని చైనా వాయుసేన స్థావరాల్లో విమానాల రాకపోకలను గమనిస్తున్నాయి.

  ఇదిలావుంటే, చైనా కదలికలను భారత నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు కేంద్ర రక్షణ, హోం మంత్రిత్వ శాఖలకు చేరవేస్తుండడంతో ఈ 5జీ వ్యవస్థకు సంబంధించిన సమాచారం వెలుగు చూసింది. అయితే మన దేశంలో ఇంకా 5జీని అధికారికంగా ఆమోదించలేదు. కానీ.. రక్షణ వర్గాలకు 5జీ సర్వీసులు వినియోగించుకునే వెసులుబాటును కల్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదే గనక జరిగితే చైనాకు ధీటుగా బోర్డర్‌లో నిఘా పెంచేందుకు రక్షణ శాఖ చర్యలు చేపట్టేందుకు సంసిద్ధంగా వున్నట్లు సమాచారం.

  Trending Stories

  Related Stories