దుబాయ్ లో స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారత్. స్కాట్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ కాగా.. 86 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 6.3 ఓవర్లలో చేరుకుంది. పుట్టినరోజు నాడు కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచాడు. బౌలింగ్ ఎంచుకుంది భారత్. స్కాట్లాండ్ ను 85 పరుగులకే కుప్పకూల్చారు. షమీ 3, జడేజా 3, బుమ్రా 2, అశ్విన్ 1 వికెట్ తీశారు. స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో ఆలౌటైంది. స్కాట్లాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జార్జ్ మున్సీ 24 పరుగులు చేయగా, మైఖేల్ లీస్క్ 21, కల్లమ్ మెక్లియోడ్ 16 పరుగులు సాధించారు. మిగతా వారంతా ఏ మాత్రం ప్రభావం చూపకుండానే పెవిలియన్ చేరారు.
ఛేజింగ్ లో ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ విజృంభించి ఆడారు. రాహుల్ 19 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 30 పరుగులు నమోదు చేశాడు. వీరిద్దరూ అవుటైనా కెప్టెన్ కోహ్లీ (2 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (6 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. సూర్యకుమార్ సిక్సర్ తో భారత్ కు విజయాన్ని అందించాడు. నెట్ రన్ రేట్ భారత్ ఛాన్సెస్ ను అడ్డుకోకుండా.. భారీ విజయాన్ని భారత్ అందుకుంది.
ఈ విజయంతో టీమిండియా గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గ్రూప్-2లో అన్ని జట్లు నాలుగేసి మ్యాచ్ లు ఆడాయి. పాక్ జట్టు 4 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. సెమీస్ కు కూడా క్వాలిఫై అయ్యింది. కివీస్ 4 మ్యాచ్ ల్లో 3 విజయాలు…. భారత్ 4 మ్యాచ్ ల్లో 2 విజయాలు నమోదు చేశాయి. న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. తన చివరి లీగ్ మ్యాచ్ ను న్యూజిలాండ్ జట్టు నవంబరు 7న ఆఫ్ఘనిస్థాన్ తో ఆడాల్సి ఉండగా, ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడితే భారత్ కు సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఒకవేళ ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే భారత్ అవకాశాలు ముగిసినట్లే. టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ను నవంబరు 8న నమీబియాతో ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్ కివీస్ మీద భారీ తేడాతో గెలిస్తే.. నమీబియాతో జరిగే మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘన్ నెట్ రన్ రేట్ ను నమీబియా మ్యాచ్ లో దాటాల్సి ఉంటుంది. లేదంటే ఆఫ్ఘన్ కూడా సెమీస్ చేరుకునే అవకాశం ఉండనుంది. ఆఫ్ఘనిస్తాన్ కివీస్ మీద గెలవాలని భారత అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.