దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ.. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసే క్రమంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మరో కొవిడ్ టీకాకు అనుమతులు మంజూరు చేసింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించింది. దేశంలో ప్రస్తుతం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ తో పాటు.. ఆస్ట్రాజెనికా అనుబంధంతో సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ టీకాలను వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. 45 ఏళ్లు దాటినవారికి టీకాలను అందిస్తున్నారు. అయితే, దేశంలో కరోనా రెండో దశ విజృంభించడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తమకు అదనపు డోసులు పంపాలని రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పుత్నిక్-వి టీకాకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఇప్పటికే అందుబాటులో వున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ తో పాటు.. ఇకపై స్పుత్నిక్-వి టీకాను కూడా అందించనున్నారు.
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాను భారత్ లో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ సంస్థ తయారు చేస్తోంది. ఇటీవల టీకా మూడో క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసింది డాక్టర్ రెడ్డీస్. భారత్ తో పాటు.. యూఏఈ, వెనిజులా, బెలారస్ లలో ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఇమ్యునోజెనిసిటీ సమాచారాన్ని తాజాగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు అందించింది. దీంతో డేటాను విశ్లేషించిన CDSCO ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ టీకా అత్యవసర వినియోగం కోసం అనుమతులకు సిఫార్సు చేసింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ లో 91.6 శాతం ఫలితాలు వచ్చాయని డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఇక, డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి రాగానే.. దేశంలో స్పుత్నిక్-వి పంపిణీ ప్రారంభమవుతుంది. ఇక, ఈ నేపథ్యంలో టీకా డేటాతో పాటు.. నిపుణుల సలహాలను సమీక్షించిన కేంద్రం దేశంలో స్పుత్నిక్-వి టీకాకు అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే స్పుత్నిక్-వి టీకాను అనేక దేశాల్లో వినియోగిస్తున్నారు. ఇప్పుడు భారత్ లోనూ అందుబాటులోకి రావడంతో.. దేశంలో టీకా కొరత ఏర్పడుతుందేమోన్న భయాలు తొలగిపోనున్నాయి.
స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను భారత్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌తోపాటు హెటెరో బయోఫార్మా, గ్లాండ్ ఫార్మా, స్టెలిస్ బయోఫార్మా, విక్రో బయోటెక్ తయారు చేస్తున్నాయి. దేశంలో 200 మిలియన్ డోసుల స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో విక్రో బయోటెక్ ఒప్పందం చేసుకొంది. ఈ వ్యాక్సిన్ ను 2 డిగ్రీల నుండి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేసుకొనే వెసులుబాటు ఉంది. ఈ మూడు టీకాలతో పాటు.. త్వరలోనే బయోలాజిక్-ఇ తయారు చేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న మరో వ్యాక్సిన్ నోవావాక్స్, జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్లకు కూడా త్వరలోనే అనుమతి లభించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, భారత్ బయోటెక్ ప్రతిష్టాత్మకంగా తయరు చేస్తున్న ముక్కుద్వారా అందించే వ్యాక్సిన్ కు కూడా త్వరలోనే అనుమతులు లభించే అవకాశం వున్నట్టు సమాచారం.
మొత్తానికి, కరోనా మలిదశ విజృంభిస్తున్న వేళ దేశంలో మరోటీకా అందుబాటులోకి రావడం ఊరటనిస్తోంది. ఒకవైపు కరోనాను ధీటుగా ఎదుర్కొనాలంటే వ్యాక్సినేషనే ఉత్తమ పరిష్కార మార్గమని నిపుణులు చెబుతూ ఉన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా కరోనా సోకినా కూడా వైరస్ ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వైద్యులు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులో వ్యాక్సిన్లను నమ్మవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అరుదుగా మాత్రమే వీటి వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు. అలాగే వ్యాక్సినేషన్ విషయంలో వేగంగా అడుగులు వేసిన వివిధ దేశాల్లో కొత్తగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కూడా మీడియా సంస్థలు చెబుతున్నాయి. 60 శాతం ప్రజలకు మించి వ్యాక్సిన్ వేసిన దేశాల్లో కొత్త కేసుల సంఖ్య చాలా తగ్గిపోయాయని అధ్యయన సంస్థలు కూడా చెబుతున్నాయి. అందువల్ల అర్హులందరూ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి. తొలి విడతలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆరోగ్య సిబ్బందికి కరోనా టీకాలు అందించిన ప్రభుత్వం.. ఆ తర్వాత 45 ఏళ్లుపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇక, ఇప్పటికే దేశంలో 10 కోట్లమందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది.