International

బ్రిటన్ కొత్త నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారతీయులకు క్వారంటైన్ విధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత్‌లో కోవిషీల్డ్ రెండు డోస్‌ల తీసుకుని తమ దేశానికి వచ్చే ప్రయాణికులను వ్యాక్సిన్ వేసుకోనివారిగానే పరిగణిస్తామని, వీరు 10 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని యూకే ప్రకటించింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది వివక్ష తప్ప మరొకటి కాదని స్పష్టం చేసింది. పూర్తిగా వివక్ష పూరితమైన విధానం అని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. ఓవైపు భారత్ లో తయారైన వ్యాక్సిన్ లను వాడుకుంటున్న బ్రిటన్, మరోవైపు అదే వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులపై ఆంక్షలు విధించడం సరికాదని.. కోవిషీల్డ్ ను అభివృద్ధి చేసింది బ్రిటన్ సంస్థలేనని, ఇప్పటికే అరకోటి కొవిషీల్డ్ డోసులను బ్రిటన్ కు అందించామని, ఆ వ్యాక్సిన్లకు అక్కడి ప్రజలకు వినియోగించారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడదే కొవిషీల్డ్ ను బ్రిటన్ గుర్తించకపోవడాన్ని వివక్షగానే భావిస్తామని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉపసంహరించుకోకపోతే తమ నుంచి తీవ్ర ప్రతిచర్యను చవిచూడాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించింది. దీనిపై బ్రిటన్ విదేశాంగ శాఖను వివరణ కోరామని సానుకూల రీతిలో స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రతిచర్య తీసుకునే హక్కు భారత్ కు ఉంటుందని వెల్లడించింది.

అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలపై భారత్ ఆందోళనల గురించి బ్రిటిష్ హై కమిషన్ ప్రతినిధి స్పందించారు. సాధ్యమైనంత త్వరగా అంతర్జాతీయ ప్రయాణాలను ప్రారంభించడానికి యూకే కట్టుబడి ఉంది.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ సురక్షితంగా, స్థిరమైన మార్గంలో మరింత స్వేచ్ఛగా ప్రయాణించడానికి వీలుకల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. భారత్‌లోని ప్రజారోగ్య సంస్థ ద్వారా టీకాలు వేసుకున్న వ్యక్తుల సర్టిఫికేషన్‌ను గుర్తించే అంశంపై భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నామని అన్నారు.

Related Articles

Back to top button