భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదం పరిష్కారానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తూర్పు లడఖ్‌లో కొనసాగుతున్న సరిహద్దు ప్రతిస్టంభన నేపథ్యంలో భారత్ – చైనా దేశాల మధ్య ఈ నెల 17న 16వ రౌండ్ సైనిక చర్చలు జరుగనున్నాయి.
ఈ సారి చర్చలు వాస్తవాధీన రేఖ వెంట భారత్ వైపున జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి సరిహద్దు వెంట శాంతి, ప్రశాంతత అవసరమని నొక్కి చెబుతూనే తూర్పు లడఖ్‌లోని మిగతా అన్ని పాయింట్ల నుంచి దళాలను ఉపసంహరించాలని చైనాపై భారత్ ఒత్తిడి తెస్తున్నది.
ఇంతకు ముందు భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య చివరి రౌండ్ చర్చలు గత మార్చి 11న జరిగాయి. తాజాగా జరిగే చర్చల్లో దేప్పాంగ్ బల్గే, డెమ్‌చోక్‌ల్లో సమస్యల పరిష్కారంతో పాటు అన్ని ఘర్షణ పాయింట్ల నుంచి వీలైనంత త్వరగా దళాలను వెనక్కి పిలవాలని చైనాపై భారత్ ఒత్తిడి చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. గతవారం బాలిలో జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశమై త్వరగా తూర్పు లడఖ్ పరిస్థితుల పరిష్కారంపై చర్చించారు. 2020, మే5న పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగగా.. ఆ తర్వాత సరిహద్దుపై ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత ఇరుదేశాలు భారీగా సైనికులు, ఆయుధాలను మోహరించాయి. సైనిక, దౌత్యపరమైన చర్చల తర్వాత గతేడాది పలు ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి పిలిచాయి.