More

    అవును.. మిసైల్ పొరపాటున పాకిస్థాన్ మీదకు వచ్చింది: భారత్ వివరణ

    9 మార్చి 2022న రొటీన్ మెయిన్టెనెన్స్ లో సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్‌లోని ఒక ప్రాంతంపై దురదృష్టవశాత్తూ క్షిపణి వెళ్లిందని భారత్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న ఘటన అంటూ భారతదేశం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారత ప్రభుత్వం సీరియస్‌గా భావించి ఉన్నత స్థాయి కోర్టు విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాక్ భూభాగంలో క్షిపణి పడిన ఘటనను భారత రక్షణశాఖ తీవ్రంగా పరిగణించింది. క్షిపణి ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నెల 9న రోజువారీ నిర్వహణలో పొరపాటు జరిగిందని.. సాంకేతిక లోపం వల్లే క్షిపణి పాక్ భూభాగంలో పడిందని వివరణ ఇచ్చింది. పాక్ భూభాగంపై తమ క్షిపణి పడడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది భారత్.

    భారతదేశానికి చెందిన సూపర్‌సోనిక్ క్షిపణి పాకిస్థాన్ మీదకు వచ్చిందని పాక్ అధికారులు తెలిపారు. మిసైల్ సిర్సా నుంచి టేకాఫ్ అయ్యిందని, పాక్ భూభాగంలోని 124 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశంలో అది ల్యాండ్ అయిందని చెప్పారు. 40,000 అడుగుల ఎత్తులో దూసుకువచ్చిందని.. ఇలాంటి మిసైల్స్ ద్వారా భారత, పాకిస్థాన్ దేశాల గగనతలంలో ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. పాకిస్థాన్ వైమానిక దళం ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్ దీన్ని గమనించిందని తెలిపారు. పాక్ గగనతలం లోకి వచ్చి, చివరికి మియా చన్ను సమీపంలో పడిపోయిందని పాక్ తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఒక గోడ పడిపోయిందని పాకిస్థాన్ మిలిటరీ తెలిపింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య 2005 నాటి ఒప్పందం ప్రకారం.. ప్రతి దేశం ఇలాంటి పరీక్షల సమయంలో కనీసం మూడు రోజుల ముందుగా ఇతర దేశాలకు తెలియజేయాలని ఉంది. భారత్ నుండి తమకు వివరణ కావాలని పాక్ కోరింది. పాకిస్థాన్‌లో ఆ మిసైల్ ప్రయాణించిన మొత్తం దూరం 124 కి.మీ గా ఉంది.

    Trending Stories

    Related Stories