భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ రాష్ట్రపతి మనవడు

మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ మనవడు ఇందర్జీత్ సింగ్ సోమవారం నాడు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మరియు ఇతర నాయకుల సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ సభ్యత్వం స్వీకరించి కాషాయ కండువా కప్పుకొన్నారు. తన దివంగత తాత కోరికను తాను నెరవేర్చానని ఇందర్జీత్ సింగ్ అన్నారు.
ఇందర్జీత్ సింగ్ తాత జ్ఞాని జైల్ సింగ్ 1982 నుండి 1987 వరకు భారత రాష్ట్రపతిగా పని చేశారు. 1994 నవంబర్ 29న ఆనంద్‌పూర్ సాహిబ్‌కు వెళ్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. చండీగఢ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ ఏడాది డిసెంబర్ 25న చనిపోయారు. మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్‌తో కాంగ్రెస్ పార్టీ సరిగా సరిగా వ్యవహరించలేదని అన్నారు. ‘నా తాతతో కాంగ్రెస్ సరిగా ప్రవర్తించలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు చూసి నా తాత చాలా బాధపడ్డారు’ అని సింగ్ ఆరోపించారు. రాజకీయాల్లో చేరాలన్న తన కోరిక చెప్పినప్పుడు, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీల ఆశీర్వాదం తీసుకోమని నా తాత జైల్ సింగ్ చెప్పారని ఇందర్జీత్ సింగ్ అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు మదన్ లాల్ ఖురానా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఆ పార్టీలో చేరకుండానే ఆయన కోసం ప్రచారం చేసిన సంగతిని గుర్తు చేశారు. ఈ రోజు బీజేపీలో చేరడంపై తాను తీసుకున్న ఈ నిర్ణయంపై తన తాత చాలా సంతోషిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
“నా తాత నన్ను రాజకీయాలకు సిద్ధం చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందా లేదా అది ప్లాన్ చేయబడిందా అన్నది ఇప్పుడు మాట్లాడడం లేదు. దాని గురించి వేరే రోజు మాట్లాడుతాము. అప్పట్లో నాకు మార్గనిర్దేశం చేయడానికి ఎవరూ లేనందున, నేను పంజాబ్‌కు తిరిగి వెళ్లాను. సామాజిక సేవ చేయడం మొదలుపెట్టాను. విశ్వకర్మ సమాజం సభ్యులను ఒకే తాటిపైకి తీసుకురావడానికి భారతదేశమంతటా పర్యటించాను .. అందులో నేను కొంత వరకు విజయం సాధించాను” అని ఇందర్జీత్ సింగ్ చెప్పారు.తాను బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాను కొంతకాలం క్రితం కలిశానని.. తనను బీజేపీలో చేర్చుకోడానికి ప్రతిపాదించారని ఇందర్జీత్ సింగ్ పేర్కొన్నారు.
2019 లో మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అల్లుడు సర్వాన్ సింగ్ చాన్నీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరియు ఇతర నాయకుల సమక్షంలో బీజేపీలో చేరారు. జ్ఞాని జైల్ సింగ్ 1982 మరియు 1987 మధ్య భారతదేశ 7 వ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన భారత హోం మంత్రిగా కూడా పనిచేశాడు. 1972 లో కాంగ్రెస్ పాలనలో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.