75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగరంలోని బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్‌తో పాటు విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ, మురళీధర్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ జండాను ఆవిష్కరించారు. దేశంకోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులు అర్పించారు. దేశభక్తుల స్ఫూర్తితో మోదీ ముందుకు సాగుతున్నారన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడిన వ్యక్తి మోదీ అని.. యువతకు దేశభక్తి స్ఫూర్తిని నింపుతున్న వ్యక్తి మోదీ అని అన్నారు. ప్రజలు మోదీకి అండగా ఉండాలని బండి సంజయ్ అన్నారు.
బండి సంజయ్ సమక్షంలో సినీ నటి కరాటే కల్యాణి, ఇతర సినీనటులు కొందరు బీజేపీలో చేరారు. జల్పల్లి కౌన్సిలర్ యాదయ్యతో పాటు పలు పార్టీల నేతలు కూడా బీజేపీలో చేశారు. వారందరినీ రాష్ట్ర బీజేపీ నాయకులు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బీజేపీ నాయకురాలు విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాలన రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందని.. తెలంగాణ బీజేపీ చేతుల్లోకి వెళితేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. బీజేపీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి ఎందరో సమర్థవంతమైన నేతలు ఉన్నారని చెప్పారు. తెలంగాణలో సంజయ్ వంటి నేత ఉన్నారని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు ఆయన పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.