దేశ రక్షణలో జవాన్ల జీవితాలకు ఎన్నడూ గ్యారెంటీ ఉండదు. శత్రువులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు ప్రాణాలను సైతం తృణప్రాయం అర్పిస్తుంటాయి. ఉగ్రవాదులు ఒకవైపు, సరిహద్దుల్లో శత్రు సైనికులు మరోవైపు.. భారత జవాన్లపై నిత్యం కాల్పులకు పాల్పడుతూనే ఉంటారు.
వారిని భారత జవాన్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటుంటున్నారు. ఇలాంటి సంధర్భంలోనే అకస్మాత్తుగా జరిగే దాడులను ఎదుర్కొనే క్రమంలో మన ఆర్మీ సిబ్బంది కొంత మంది వీరమరణం పొందుతున్నారు. అయితే గడిచిన ఐదేళ్లలో ఎంత మంది జవాన్లు వీరమరణం పొందారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.
గడిచిన ఐదేళ్లకాలంలో 307 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, అసోం రైఫిల్స్‌కు చెందిన జవాన్లు దేశ రక్షణలో అసువులు బాసారని కేంద్రం తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సందర్భంగా భద్రతా బలగాలకు సంబంధించిన డేటాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన లెఫ్ట్‌వింగ్ తీవ్రవాదం కింద జరిగిన హింసాత్మక సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సైతం సమర్పించారు.
2009లో వామపక్ష హింస అత్యధిక స్థాయిలో ఉందని, ఆ తర్వాత ఏడాదిలో రికార్డు స్థాయిలో 2258 ఘటనలు నమోదయ్యాయని చెప్పారు. అప్పటి నుంచి ఈ ఘటనలు 77శాతం తగ్గాయన్నారు. 2021లో 509 సంఘటనలు నమోదయ్యాయన్నారు. అదే విధంగా ఈ హింసలో మరణాలు 2010తో పోలిస్తే 85 శాతం తగ్గాయి. 2021లో 147 మంది మరణించగా, 2010లో 1,005 మంది మరణించారని నిత్యానంద్ రాయ్ తెలిపారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్‌తో సహా మరే ఇతర డేటాబేస్‌ను సిద్ధం చేయడానికి వ్యక్తిగత డేటా ఉపయోగించడదని మంత్రి స్పష్టం చేశారు.