పాక్ లో మరో దారుణం.. చెట్టుకు ఉరివేసి, చనిపోయే వరకు ఇటుకలతో కొట్టారు

0
924

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ మూక ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణతో ఒక వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. స్థానిక పోలీసులు నిందితులను అడ్డుకోలేదని కూడా తెలుస్తోంది. ఖనేవాల్ జిల్లాలోని మియాన్ చున్నూలోని పోలీస్ స్టేషన్ నుండి నిందితులను బయటకు విడిచిపెట్టారు స్థానిక పోలీసులు. బాధితుడిని సమీపంలోని ప్రదేశానికి ఈడ్చుకెళ్లి చిత్రహింసలు పెట్టి హత్య చేశారని, అయితే పోలీసులు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించారు.

ఒక వ్యక్తి ఖురాన్‌లోని కొన్ని పేజీలను చింపి, ఆపై వాటిని తగులబెట్టాడనే ప్రచారం జంగిల్ డేరా గ్రామంలో చోటు చేసుకుంది. వదంతులు వేగంగా వ్యాపించడంతో వందలాది మంది స్థానికులు మగ్రిబ్ ప్రార్థనల తర్వాత గుమిగూడి అతడిపై దాడి చేయడం మొదలు పెట్టారు. ఆ వ్యక్తి మాట వినడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో, అతను దోషి అని నివేదించిన గ్రామస్థులు అతన్ని మొదట చెట్టుకు ఉరివేసి, అతను చనిపోయే వరకు ఇటుకలతో కొట్టారని డాన్ న్యూస్ నివేదించింది.

ఇలాంటి ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకోవడం ఇది మొదటి సంఘటన కాదు. గత ఏడాది నవంబర్‌లో ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని చర్సద్దా జిల్లాలో పవిత్ర ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణపై గతంలో అరెస్టు చేసిన వ్యక్తిని పోలీసుల నుండి లాక్కొని రావడానికి ప్రయత్నించింది. అందుకు అధికారులు నిరాకరించడంతో పోలీసు స్టేషన్ కు నిప్పంటించారని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.

డిసెంబర్ 3, 2021న సియాల్‌కోట్‌లో, దైవదూషణ ఆరోపణలపై శ్రీలంక ఇంజనీర్‌ని ఫ్యాక్టరీ కార్మికులు కొట్టి చంపారని డాన్ నివేదించింది. సియోల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమార (40) ఎక్స్‌పోర్టు మేనేజరుగా పనిచేస్తున్నారు. తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ (టీఎల్‌పీ) అనే కరడుగట్టిన మతవాద సంస్థ ఆయన కార్యాలయానికి సమీపంలోని గోడపై ఓ పోస్టరు అంటించింది. ఆ పోస్టర్‌పై ఖురాన్ పద్యాలు ముద్రించి ఉన్నాయి. తన కార్యాలయ గోడపై అంతికించిన ఆ పోస్టరును ప్రియాంత చింపి చెత్తబుట్టలో పడేశారనే ఆరోపణలు వచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే పెద్ద మూకగా ఏర్పడి అతడి కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దైవదూషణకు పాల్పడ్డాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసి మూకుమ్మడిగా దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంతను బతికి ఉండగానే దహనం చేశారు. ఇలాంటి దారుణాలు ఎన్ని జరుగుతున్నా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం లో ఎటువంటి చలనం రావడం లేదు.