More

  తాలిబాన్లకు తన మద్దతును మరోసారి ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్

  ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు చేస్తున్న దారుణాల గురించి ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూస్తోంది. ఆఫ్ఘన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం తాలిబాన్లు పెద్ద ఎత్తున మారణహోమం సృష్టిస్తూ ఉన్నారు. అమెరికా దళాలు వెనక్కు వెళ్లిపోతున్న తర్వాత తాలిబాన్ల అరాచకానికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. మరో వైపు పాకిస్తాన్ నుండి తాలిబాన్లకు మద్దతు ఉండడంతో మరింతగా రెచ్చిపోతూ ఉన్నారు. తాజాగా తాలిబాన్లకు మద్దతుగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ మంగళవారం ఉగ్రవాద సంస్థ తాలిబాన్లను “సాధారణ పౌరులు” అని పేర్కొంటూ బహిరంగంగా తన మద్దతును ప్రకటించారు. పాకిస్తాన్ వారిని చంపలేదని కూడా చెప్పారు.

  తాలిబాన్లేమీ సైనికులు కాదని వారూ సాధారణ మనుషులేనని చెప్పుకొచ్చారు పాక్ ప్రధాని. మా దేశ సరిహద్దుల్లో 30 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులు గుడారాలేసుకుని ఉంటున్నారని.. వాళ్లలో కొందరు సామాన్య ప్రజలూ ఉన్నారని.. అలాంటప్పుడు వారిని మేమెలా వేటాడి చంపేస్తామని అన్నారు. తాలిబాన్లకు పాక్ స్వర్గధామంలా మారిందని చెబుతున్నవారు.. అందుకు సరైన ఆధారాలను ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. శరణార్థి శిబిరాలున్నంతమాత్రాన వాటిని తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నామని ఎలా అంటారని ప్రశ్నించారు. తాలిబాన్లకు పాక్ ఆర్థికంగా తోడ్పాటునందించి, ఆయుధాలను సరఫరా చేస్తోందన్న వార్తల్లో నిజం లేదని అవి నీచ ప్రచారాలని కొట్టివేశారు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత తాము అమెరికాకు సాయం చేశామని, ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమవంతు కృషి చేశామని అన్నారు. ఆఫ్ఘన్ పై సైనిక దాడి చేసి అమెరికా పెద్ద తప్పు చేసిందని ఇమ్రాన్ అన్నారు. పై చేయి ఉన్నప్పుడే తాలిబన్లతో రాజకీయ పరిష్కారం చేయకుండా, బలహీన దశలో చేసుకుందని అన్నారు. బలగాలు 10 వేలకు తగ్గాక, ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోయే ముందు రాజకీయ రాజీ చేసుకుంటే లాభం లేదని.. ఇప్పుడు తామే గెలిచామంటూ తాలిబన్లు అనుకుంటున్నారని అన్నారు. ఆఫ్ఘన్ లో పౌర యుద్ధం వచ్చే పరిస్థితులూ ఉన్నాయన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా అమెరికా, తాలిబన్ల మధ్య చర్చలకు తాను సాయం చేస్తానని ఇమ్రాన్ చెప్పారు. చర్చలు జరిగేందుకు మాత్రమే సాయం చేస్తామని, మిగతా ఎలాంటి విషయాల్లోనూ అమెరికాతో సంబంధాలు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. దేశంలో అమెరికా సైనిక బేస్ ల ఏర్పాటుకూ అంగీకరించబోమని చెప్పారు.

  యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకారం తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) కు చెందిన 6,000 మందికి పైగా ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లో తమ సహచరులతో చేరారు. ఆఫ్ఘన్ జాతీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో తాలిబాన్లకు సహాయం చేయడానికి పాకిస్తాన్ తీవ్రవాదులకు మద్దతుగా ఉంటోంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రయాణించడానికి పాకిస్తాన్ సదుపాయం కల్పించిందని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆరోపించింది.ఆఫ్ఘన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో తాలిబాన్లకు సైనికపరంగా, ఆర్థికంగా, ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను ఇవ్వడంలో పాకిస్తాన్ చాలాకాలంగా సహాయం చేస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది. ఇమ్రాన్ ఖాన్ మాత్రం అటువంటి ఆరోపణలను “చాలా అన్యాయం” అని కొట్టివేశారు.

  తీవ్రవాదులకు మద్దతు తెలుపుతూనే ఉన్న ఇమ్రాన్ ఖాన్:

  ఇమ్రాన్ ఖాన్ తీవ్రవాదులకు, తీవ్రవాద నాయకులకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల యుద్ధానికి తరచూ మద్దతు ఇస్తూనే వస్తున్నారు ఇమ్రాన్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పవిత్ర యుద్ధం(జిహాద్) చేస్తున్నారని తాను నమ్ముతూ ఉన్నానని గతంలోనే వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్. 2012 లో ఇమ్రాన్ ఖాన్ తాలిబాన్ల ఉగ్రవాదాన్ని సమర్థించడానికి పదేపదే ప్రయత్నించారు. దీనిని ఇస్లాం కోసం ‘పవిత్ర యుద్ధం’ అని పిలిచారు.

  ఇమ్రాన్ ఖాన్ తాను ఉగ్రవాద సానుభూతిపరుడని పదే పదే నిరూపించుకుంటూ ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ అల్-ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పట్ల పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించడం చూసి ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. లాడెన్ ను “స్వాతంత్ర్య సమరయోధుడు” అని కూడా పేర్కొన్నారు. ఒసామా బిన్ లాడెన్ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించడానికి, ఇమ్రాన్ ఖాన్ అతనిని జార్జ్ వాషింగ్టన్ తో పోల్చారు. అతను బ్రిటిష్ వారికి ఉగ్రవాది అని, అమెరికన్లకు స్వాతంత్ర్య సమరయోధుడు అని చెప్పారు.

  పాకిస్తాన్ లోపల ఉగ్రవాదాన్ని నిర్వహిస్తున్న ఉగ్రవాద గ్రూపుల పట్ల ఇమ్రాన్ ఖాన్ తన మృదువైన వైఖరిని చూపించారు. ఆఫ్ఘన్ తాలిబాన్ల మాదిరిగానే పష్తున్ గిరిజనులతో తయారైన ఇస్లామిక్ టెర్రర్ గ్రూపు అయిన తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ కు మంచి సంబంధం ఉంది. జూన్ 2013 లో, యుఎస్ డ్రోన్ దాడిలో తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ డిప్యూటీ చీఫ్ వాలియూర్ రెహ్మాన్ మెహసూద్‌ను చంపినప్పుడు.. ఇమ్రాన్ ఖాన్ అతనిని శాంతి కాముకుడు అని పేర్కొనడం వివాదాన్ని రేకెత్తించింది.

  ఇమ్రాన్ ఖాన్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ లను “సాధారణ” పౌరులుగా పేర్కొనడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే పాకిస్తాన్ తరచుగా తన పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంపై ఉగ్రవాద దాడులు చేయడానికి పౌరులుగా మారువేషంలో ఉన్న ఉగ్రవాదులను ఉపయోగించింది. తీవ్రవాదానికి తాము వ్యతిరేకం అని చెప్పుకునే పాక్ నాయకులు.. ఎప్పటికప్పుడు తీవ్రవాదులకు తమ మద్దతు ఇస్తూనే వస్తున్నారు.

  Related Stories