పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తనను తాను ప్రపంచ స్థాయి నేతగా భావిస్తూ ఉంటాడు. కానీ ఆయనకు అంత సీన్ లేదన్నది ఇంకా గుర్తించలేకపోతున్నాడు. ముఖ్యంగా అమెరికా తనను చిన్న చూపు చూస్తోందని తెలిసి తెగ ఫీలైపోతున్నాడు. గత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇమ్రాన్ ఖాన్ ను చాలా దూరం పెట్టాడు. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఇమ్రాన్ ఖాన్ ను కనీసం పట్టించుకోవడం లేదు. భారత్ తో అమెరికా సంబంధాలు మరింత దృఢపడుతూ ఉంటే.. పాక్ వైపు అమెరికా కన్నెత్తి చూడడం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు తనను ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ఇమ్రాన్ ఖాన్ బాధ..! ఇమ్రాన్ ఖాన్ అహం దెబ్బ తిన్న కీలక అంశం ఏమిటంటే.. డొనాల్డ్ ట్రంప్ స్థానంలో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ అధికార పగ్గాలు చేపట్టి ఎనిమిది మాసాలు గడిచినా బైడెన్ నుంచి మర్యాదపూర్వకంగా ఫోన్ కాల్ రాలేదు. ఇప్పటికే భారత ప్రధానితోనూ, మరికొన్ని చిన్న దేశాలతోనూ జో బైడెన్ మాట్లాడారు.. కానీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మాత్రం ఫోన్ కాల్ వెళ్ళలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల తర్వాతనైనా తనకు బైడెన్ నుంచి ఫోన్ కాల్ వస్తుందని ఇమ్రాన్ ఆశించినా అది జరగలేదు. ఓ ఇంటర్వ్యూలో తనకు ఎందుకు ఫోన్ కాల్ చేయలేదో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌నే అడగాలని ఇమ్రాన్ ఖాన్ అన్నాడంటే అసహనం ఎంత పీక్స్ కు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాతో బహుముఖ సంబంధాలను తాము కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అమెరికాదే ఆఫ్ఘన్ విషయంలో తప్పని కూడా ఇమ్రాన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! ఈ వ్యాఖ్యలను కూడా అమెరికా పరిగణలోకి తీసుకుంది.
ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాక్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు తమతో కలిసి ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో పాలుపంచుకుంటూనే, మరోవైపు ఆఫ్ఘన్ లో తాలిబాన్లకు సహకారం అందిస్తోందంటూ బ్లింకెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ 20 ఏళ్లలో పాక్ ఆఫ్ఘన్ లో ఏంచేసిందన్నది తెలుసుకోవాల్సి ఉందని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వం ఇంతటి తెలివితక్కువ వ్యాఖ్యలు చేయడం గతంలో ఎన్నడూ లేదని పేర్కొన్నారు. మమ్మల్ని వారు ఒక అద్దె తుపాకీలా భావించారు. ఉగ్రవాదంపై అమెరికా చేసిన పోరాటంలో భాగస్వామ్యం కావడం వల్ల పాక్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో పాక్ ను అమెరికా ఓ పావుగా వాడుకుందని ఆరోపించారు. ఆఫ్ఘన్ పోరాటంలో వారిని మేం గెలిపించాలని ఆశించారు. కానీ మేం ఎన్నటికీ అలా చేయలేదు. ఆఫ్ఘన్ భూభాగంపై సైనికపరంగా అనుకున్న లక్ష్యాలను సాధించలేరని అమెరికా వర్గాలను పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నాను. అక్కడ తాలిబన్ల బలాన్ని గుర్తించి వారితో రాజకీయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలని అమెరికాకు సూచించాను. కానీ అదేమీ లేకుండానే అమెరికా అక్కడి నుంచి నిష్క్రమించిందని ఇమ్రాన్ ఖాన్ అంతా తనకే తెలుసన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ లో మళ్లీ తాలిబన్ల హవా మొదలైన తర్వాత తాను ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మాట్లాడలేదని వెల్లడించారు. పాక్-అమెరికా సంబంధాలు ఒక్క ఫోన్ కాల్ పై ఆధారపడిలేవని మాత్రం గట్టిగా చెప్పగలనని స్పష్టం చేశారు.
తాలిబాన్లకు వత్తాసు పలుకుతున్న ఇమ్రాన్ ఖాన్:
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి, స్థిరత్వం రావాలంటే తాలిబన్లతో అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయడం ఒక్కటే మార్గమని అన్నారు. తాలిబాన్లు ప్రస్తుతం అన్ని వర్గాలను కలుపుకొని పనిచేయగలిగితే ఆఫ్ఘన్ లో 40ఏళ్ల తర్వాతి శాంతిని చూడవచ్చని అన్నారు. అక్కడ హింస, మానవ సంక్షోభం, భారీ సంఖ్యలో శరణార్థుల వంటి సమస్యలతో మరోసారి అస్థిరత ఏర్పడవచ్చని.. ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ కోరలు చాచే ప్రమాదం ఉందని ఇమ్రాన్ తెలిపారు.