ఆ పేపర్స్ తో తలపట్టుకున్న ఇమ్రాన్ ఖాన్.. పక్కనున్నవాళ్ళే

0
648

పండోరా పేపర్స్ పై పలు దేశాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పాకిస్తాన్ లో కూడా ఈ పేపర్స్ కారణంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. పాకిస్తాన్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆ దేశ రాజకీయనాయకులు పెద్ద ఎత్తున డబ్బులు విదేశాలకు తరలించారు. వీరిలో చాలా మంది ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులే ఉన్నారట..! ఆయన మినిస్టర్స్ కూడా ఏ మాత్రం తక్కువ తినలేదని ఈ పేపర్స్ లో తెలిసింది.

పాకిస్తాన్ ఆర్థిక పతనం అంచున ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని కీలక సభ్యులు, రాజకీయ నాయకులను దేశం నుండి డబ్బును ఇతరదేశాలకు పంపిస్తూనే ఉన్నారని పండోరా పేపర్స్ వెల్లడించాయి. ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్ మంత్రులు, వారి కుటుంబాలు, ప్రధాన ఆర్థిక బ్రోకర్లతో సహా దాదాపు 700 మంది పాకిస్తానీలు రహస్యంగా మిలియన్ల డాలర్ల సంపదను కలిగి ఉన్న వారిలో ఉన్నారని ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పండోరా పేపర్స్ లో తెలిపింది. పాకిస్తాన్ కు చెందిన మిలిటరీ లీడర్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బును విదేశాలకు తరలించారని ఈ పేపర్స్ లో తేలింది. ఇమ్రాన్ ఖాన్ మంత్రులు మరియు సహాయకులు పేర్లు పేపర్స్ లో ఉన్నా పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రమేయం గురించి నేరుగా ప్రస్తావించలేదు. పేపర్లలో పేర్కొన్న వారిలో ఆర్థిక మంత్రి షౌకత్ ఫయాజ్ అహ్మద్ తారిన్, అతని కుటుంబం మరియు ఖాన్ ఆర్థిక మరియు రెవెన్యూ మాజీ సలహాదారు వకార్ మసూద్ ఖాన్ కుమారుడు ఉన్నారు. అమెరికాలో మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరిఫ్ నఖ్వీ గురించి కూడా ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి పెద్ద ఎత్తున డబ్బులు విరాళం ఇచ్చింది ఈయనే అని గతంలో వార్తలు కూడా వచ్చాయి.

విచారణ చేపట్టబోతున్నామని చెప్పిన ఇమ్రాన్ ఖాన్:

పండోరా పేపర్స్ లో పేర్లున్న ప్రతి ఒక్కరిపై విచారణ చేపడతామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. ఈ విషయమై అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేశామని సోమవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. పన్ను ఎగవేస్తు అవినీతికి పాల్పడుతూ అడ్డంగ దొరికిపోయిన ఉన్నత వర్గాల అక్రమ సంపాదనను బహిర్గతం చేసిన పండోరా పేపర్స్‌ను మేము స్వాగతిస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. మొత్తం అక్రమ సంపాదన ఏడు ట్రిలియన్ డాలర్లని ఐక్యరాజ్యసమితి ప్యానెల్ అయిన ఫ్యాక్టీ వెల్లడించింది. ఏ దేశం పేద దేశం కాదని, కానీ ప్రజల డబ్బు, పెట్టుబడులు దారి మళ్లించడం వల్ల ప్రజలు పేదరికంలోకి వెళ్తున్నారని నేను రెండు దశాబ్దాలకు పైగా చేస్తున్న పోరాటంపై మరింత విశ్వాసం పెరిగిందని అన్నారు. మా ప్రభుత్వం దీనిపై విచారణ చేస్తుంది. పండోరా పేపర్స్‌లో వచ్చిన ప్రతి పాకిస్తానీపై విచారణ కొనసాగుతుంది. ఈ తీవ్రమైన అన్యాయాన్ని సంక్షోభంగా పరిగణించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నానన్నారు.

‘పండోరా పేపర్స్’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రహస్య పత్రాలను ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల పేర్లతో పాటు దేశంలోని ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలు, 150 మీడియా సంస్థలు, 6 వందలమంది జర్నలిస్టుల నుంచి సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ వివరాల్ని వెలువరించింది ఐసీఐజే సంస్థ.